ఆత్మశోధన చేసుకోవాలి: సోనియా

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద పార్టీ లోతైన ఆత్మశోధన జరుపుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. కుమారుడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వెంటరాగా ఆదివారం ఏఐసీసీ కార్యాలయంలో మీడియా ముందుకు వచ్చిన సోనియా ఫలితాలను తనదైన శైలిలో విశ్లేషించారు. ఆమె మాటల్లోనే… అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలహీన ప్రదర్శన మీద లోతైన ఆత్మశోధన జరుపుకుంటాం. కారణాలు విశ్లేషించి, తప్పులు జరిగితే సరిదిద్దుకుంటాం. పరాజయానికి అనేక కారణాలున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం బాగా ఉంది. ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఏమైనా పార్టీ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా లేరు. లేకుంటే ఇలాంటి ఫలితాలు వచ్చేవి కావు. మేము చాలా..చాలా నిరాశ చెందాం. అయితే ఈ తీర్పును వినవూమంగా స్వీకరిస్తున్నాం.
sonia
అలాగే విజయం సాధించిన ప్రతిపక్షాలను అభినందిస్తున్నాం. వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు కృషి జరుపుతాం. ఈ ఫలితాలు వచ్చే సాధారణ ఎన్నికలపై ప్రభావాన్ని చూపబోవు. సాధారణ ఎన్నికలు పూర్తిగా విభిన్నమైనవి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్థానికాంశాల మీద, రాష్ట్రస్థాయి నాయకుడి వ్యక్తిత్వం మీద దృష్టి పెడతారు. జాతీయ రాజకీయాలకు వస్తే జాతీయాంశాలుంటాయి. దేశాన్ని ఏనాయకుడు సరైన మార్గంలో తీసికెళ్తాడో బేరీజు వేస్తారు. రెంటికీ చాలా తేడా ఉంటుంది. ఢిల్లీ పరాజయానికి వస్తే ఇక్కడ ఎంతో చేశామని నేను విశ్వసించాను. ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. తప్పుపూక్కడ జరిగిందీ తెలుసుకుని దిద్దుకుంటాం.రాజస్థాన్‌లాంటి రాష్ట్రాల విషయానికి వస్తే అక్కడ మా ముఖ్యమంత్రి చాలాచాలా బాగా పనిచేస్తున్నాడని అనుకున్నా. కానీ ఇపుడు ప్రశ్నార్థకం మిగిలింది. పార్టీ ప్రధాని అభ్యర్థి ప్రకటనపై ఎవరికీ చింత వద్దు. సరైన సమయంలో ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తాం.

సంప్రదాయ పద్దతులకు స్వస్తి పలకాలి: రాహుల్ గాంధీ
‘ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో అనేకమందిని కలుపుకుపోయింది. సామాన్యుడి దగ్గరకు దూసుకుపోయింది. కచ్చితంగా వారినుంచి మేం నేర్చుకోవాల్సిందే. ఈ విషయంలో జాతీయపార్టీలుగా మేము, బీజేపీ విఫలమయ్యాం. ఢిల్లీలో మా రెండు ప్రధానపార్టీలు రాజకీయాలను ఇంకా పాతపద్దతిలోనే చూస్తున్నట్టున్నాం. రాజకీయ పార్టీలు సామాన్యుడికి తగినంత అవకాశం ఇవ్వడం లేదు. ఇకముందు ప్రజలను కలుపుకుపోయే రాజకీయాలు, సాధికారత అందించే రాజకీయాలే రావాలి. ఈ విషయాన్ని పార్టీ వేదికల మీద నేను పలుమార్లు చెప్పా. ఇకముందు మరింత దూకుడుగా వెళతా. రానున్న కాలంలో మీరు ఊహించనంత భారీగా సామాన్యులను కలుపుకుపోతా. ఈ ఫలితాల ద్వారా ప్రజలు మాకో సందేశం ఇచ్చారు. మేం దాన్ని మనసుపెట్టి విన్నాం. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి మేం ఎంతో చేయాల్సిఉంది. ప్రజల కోరుకునే విధంగా తనను తాను మార్చుకోగల సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది. విజయం సాధించిన ప్రతిపక్షాలకు అభినందనలు. ఢిల్లీ విషయానికి వస్తే షీలా దీక్షిత్ ఎంతో కష్టపడ్డారు. నగరానికి సుపరిపాలన అందించారు. అయితే సుపరిపాలన గురించి మాట్లాడడం కన్నా అమలును ఇంకా కొంత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటే బాగుండేదనుకుంటున్నా’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.