కేంద్ర మంత్రివర్గం తెలంగాణ బిల్లుకు ఆమోదముద్ర వేసినా సీమాంధ్రకు అనుకూలంగా సవరణలు చేపట్టడంతో తెలంగాణవాదులు కంగుతిన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తున్నదని ఆనందించాలో, చేపట్టిన సవరణల వల్ల జరుగుతున్న నష్టానికి విచారించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. బిల్లులో తెలంగాణ వాదులు ప్రతిపాదించిన సవరణలు పట్టించుకోకుండా, సీమాంధ్రనేతల ప్రతిపాదనలకు మాత్రమే ఆమోదం తెలుపడంతో వారిలో అంతర్మథనం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మినహా మిగిలిన ఏ ప్రతిపాదనా ఆమోదయోగ్యంగా లేదని వారంటున్నారు.
పోలవరం ముంపుగ్రామాల సమస్య సమసిందని భావించిన తర్వాత ఆఖరు నిమిషంలో భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలపాలని జీవోఎం చేసిన నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో తెలంగాణ వాదులు కంగుతిన్నారు. ఇక స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు, ఫించను పంపిణీ, ఏపీ భవన్‌ను తెలంగాణకు ఇవ్వడం, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం, తెలంగాణకు ప్రత్యేక విద్యుత్ బోర్డులు ఏర్పాటు చేయడం వంటి సవరణలు చేపట్టాలని కేసీఆర్ స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సీమాంధ్ర నాయకులిచ్చిన సవరణలు అంగీకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రాణిహిత- చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టకపోవడం ఆయనను కలచివేసింది. రాష్ట్ర విభజనలో కేంద్రం పోలవరానికి, హైదరాబాద్‌కు లింకుపెట్టి ఓ నిర్ణయం తీసుకుంది. ముంపునకు గురయ్యే భద్రాచలం రెవెన్యూ డివిజన్‌తో పాటు మరో డివిజన్‌కు చెందిన ఏడు మండలాలలోని దాదా పు 70 రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో కలపాలని నిర్ణయించింది. విలీనం వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆదివాసి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఏ అంతరాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కూడా ఇలా జరుగలేదు. ఈ విషయాలన్నింటి మీద చర్చించేందుకు ఢిల్లీలో అందుబాటులో ఉన్న జేఏసీ నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, నిపుణులు, మాజీ ఐఏఎస్ అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు.
శుక్రవారం నాటి కేంద్ర మంత్రి వర్గ సమావేశం తెలంగాణ బిల్లుకు చేసిన 32 సవరణల్లో అనేకం తెలంగాణ సమాజం గాయపడే విధంగా ఉన్నాయని తెలంగాణ వాదులు అభిప్రాయపడ్డారు. సీమాంధ్రులను సంతృప్తి పరచడానికే పలు సవరణలను కేబినెట్ ఆమోదించిందని మండిపడ్డారు. మరోవైపు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల నెరవేరుతున్న తరుణంలో ఈ విషయాలపై ఎలా వ్యవహరించాలన్న దానిపై తర్జనబర్జనలు పడ్డారు. ఈ ప్రతిపాదనలను మూకుమ్మడిగా వ్యతిరేకిస్తే అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే ఇబ్బంది ఎదురవుతుందా? అనే కోణంలో సైతం చర్చసాగింది. ఆచితూచి వ్యవహరించాలనే సూచన వచ్చింది.