ఆగని ‘ధ్వంస రచన’

దొరికితేనే దొంగలు.. అప్పటిదాకా అంతా రాజా దర్జాలే! సీమాంధ్ర ఏలుబడిలో రాష్ట్ర సచివాలయంతోపాటు జిల్లా కార్యాలయాల్లోనూ వారు ఆడిందే ఆట.. పాడిందే పాట!! ఇంతకాలం సాగింది అదే. ఇప్పుడు.. దీర్ఘకాలిక ఆకాంక్ష తెలంగాణ సాకారమవుతున్నదన్న సంకేతాలొస్తున్న నేపథ్యంలో అంతటా ఆందోళన. చేసిన తప్పులు ఎక్కడ బయటపడిపోతాయోననే భయం. అందుకే.. అక్రమ వడ్డింపులకు సంబంధించిన ఫైళ్లను అదృశ్యం చేయాలనే అరాచకం.
ఆది, సోమవారాల్లో మొత్తం ఎల్ బ్లాక్‌లోని ఆరు,ఏడు అంతస్తుల్లో పడేసిన ఫైళ్లను క్లియర్ చేసిన అధికారులు, వాటిలో గుర్తించిన విలువైన ఫైళ్లను సెంట్రల్ రికార్డ్ బ్రాంచ్‌కు తరలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ తతంగాన్ని మొదట్లోనే గమనించి ప్రశ్నించిన టీ మీడియాకు పొంతనలేని సమాధానాలు వినిపించిన అధికారులు విలువైన ఫైళ్లు దొరకడంతో కిమ్మనడంలేదు. వాటిలో కీలకమైన భూ కేటాయింపులు, అసైన్డ్ భూముల పందేరాలు, వివిధ మెమోలు, జీఓఆర్టీలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉన్న పలు ఫైళ్లు దొరికాయని సమాచారం. దీంతో నాలుక కరుచుకున్న అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం చేరితే ఎక్కడ తలనొప్పులు వస్తాయోననే భయంతో గుట్టుచప్పుడు కాకుండా వాటిని భద్రపరిచినట్లు తెలిసింది. తప్పులు సవరిస్తున్నట్లు కనిపించాలని ప్రయత్నిస్తున్నా, మరిన్ని అక్రమాలకు తెరలేస్తున్నదనే ఆరోపణలొస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని రెవెన్యూ ఫైళ్ల ధ్వంస రచన కొనసాగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ జిల్లాల్లో పాత అక్రమాలు బయటపడకుండా కొందరు మాయోపాయాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.

మాన్యువల్‌ను పట్టించుకోకుండా..
వాస్తవానికి కాలం తీరిన, పనికిరావనుకున్న ఫైళ్లను సెక్ర ఆఫీస్ మాన్యువల్ నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మూలించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం జీఓఆర్టీలను రొటీన్‌గా పరిగణించి ఐదేళ్ల అనంతరం ధ్వంసం చేయవచ్చు. అదేరీతిలో మెమోలను కూడా ఐదేళ్ల కాలపరిమితి అనంతరం తొలగించవచ్చు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతకాలమైనా భద్రంగా ఉంచాలని మాన్యువల్ స్పష్టం చేస్తోంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో వీటిని ధ్వంసం చేయాల్సి వస్తే అందుకు పూర్తి బాధ్యత సెక్షన్ ఆఫీసర్లదేనని రూల్స్ పేర్కొంటున్నాయి. అలాంటి సందర్భాల్లో మొదటిపేజీ ఫైల్ డాకెట్ రూపొందించి, అవసరమైన ప్రతులను జతచేసి మొత్తం ఫైల్ భారాన్ని తగ్గించాలని నిబంధన ఉంది. దీనిని ఎక్కడా పాటించని అధికారులు గుండుగుత్తగా చెత్తగా తేల్చి చించేయాలని భావించడమే వివాదాలకు తావిచ్చింది. రికార్డుల మాయం వెనుక సీమాంధ్ర కుట్ర దాగుందనే అనుమానాలకు మరికొన్ని రుజువులు లభిస్తున్నాయి.

జిల్లాల్లోనూ రికార్డుల మాయం..
రాజధాని నగరంలోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లోనూ ఫైళ్ల తకరారు కొనసాగుతోంది. అనవసరమైనవాటి పేరిట అక్రమాలకు సంబంధించిన పత్రాలను ధ్వంసం చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. తహశీల్ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసులు, కలెక్టరేట్లలో చాపకిందనీరులా రికార్డులను మాయం చేసే కుట్ర విస్తరిస్తోందని తెలంగాణ, ఆంధ్ర ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆరోపించారు. హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో నిజాం నవాబులకు అప్పటి ఇండియన్ యూనియన్ సర్కార్ ఒప్పందం మేరకు 10లక్షల ఎకరాల భూమిని కేటాయించి వాటిని రికార్డుల్లో గ్రీన్ బుక్ అగ్రిమెంట్‌గా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అనంతరకాలంలో ప్రభుత్వంలోని సీమాంధ్ర అధికారులు, ప్రభుత్వం తెలంగాణకు ఇవి దక్కకుండా ఆయా భూములను రికార్డుల్లో నిజాం ప్రభుత్వ భూములుగా, అనంతరం అవే రికార్డులను సవరించి ప్రభుత్వ భూములుగా బదలాయించారని తెలిపారు. మొదటి దశలో 1969లో వచ్చిన తెలంగాణ ఉద్యమం అనంతరం 1972లో అప్పటి సీమాంధ్ర సర్కార్ పలు రికార్డులను తగులబెట్టిందని, తాలూకాల్లోని రికార్డులను మండల వ్యవస్థ ఏర్పాటు అనంతరం కుట్రపూరితంగా దొరకుండా చేశారని ఆయన ఆరోపించారు. రికార్డులను ట్యాంపర్ చేయడంద్వారా తెలంగాణ ఆస్తులను ఎగరేసుకుపోయే కుట్ర పన్నారన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.