ఆఖరి విస్తరణ

newministers
పదవుల పందేరం పూర్తి.. కేంద్ర కేబినెట్‌లో కొత్తగా 8 మందికి చోటు

– నలుగురికి కేబినెట్ ర్యాంకు
– మరో నలుగురికి ‘సహాయం’
– కార్మిక శాఖ నుంచి రైల్వేకు ఖర్గే
– పంతం నెగ్గించుకున్న సాంబశివరావు.. జౌళి మంత్రిగా కేబినెట్ హోదా
– ఆర్థిక సహాయ మంత్రిగా జేడీ శీలం
– 77కు పెరిగిన కేంద్ర మంత్రుల సంఖ్య
– 13కు పెరిగిన రాష్ట్ర ప్రాతినిధ్యం
మరో ఏడాదిలో జరిగే ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేసిన కాంగ్రెస్ నాయకత్వం.. కేంద్ర మంత్రివర్గాన్ని సోమవారం విస్తరించింది. కొత్తగా ఎనిమిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంది. నలుగురికి కేంద్ర కేబినెట్ హోదా కల్పించి.. మరో నలుగురికి సహాయ మంత్రి పదవులు ఇచ్చింది. శీష్‌రాం ఓలా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లకు నాలుగేళ్ల తర్వాత కేబినెట్ మంత్రులుగా రీ ఎంట్రీ కల్పించారు. కేంద్ర నాయకత్వంపై కొంతకాలంగా అలకతో ఉన్న ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావుకు ఇప్పటికే సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా పదోన్నతి లభించడమే కాకుండా.. తాజా మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ మంత్రి పదవి దక్కింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్‌కు చెందిన సీనియర్ నేత గిరిజా వ్యాస్‌కు కూడా కేబినెట్‌హోదా లభించింది. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్‌రావు గావిట్, సంతోష్‌చౌదరి, జేడీ శీలం, ఈఎంఎస్ నచియప్పన్‌లకు సహాయ మంత్రి పదవులు దక్కాయి. సంతోష్ చౌదరి, జేడీశీలం, నచియప్పన్ కేంద్ర మంత్రులు కావడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ఉన్న మల్లిఖార్జు ఖర్గేను రైల్వే శాఖకు మార్చారు. యూపీఏ నుంచి డీఎంకే వైదొలగడం, పవన్ కుమార్ బన్సల్, అశ్వనికుమార్, అజయ్ మాకెన్, సీపీ జోషి పార్టీ పని కోసం కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోవడంతో ఏర్పడిన ఖాళీలను కొత్తవారితో ప్రధాని భర్తీ చేసుకున్నారు. తాజా విస్తరణతో ఆంధ్రవూపదేశ్ నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న మంత్రుల సంఖ్య జైరాంరమేశ్‌తో కలుపుకొని 13కు పెరిగింది. ఇందులో నలుగురు కేబినెట్ మంత్రులు కాగా, చిరంజీవి స్వతంత్ర హోదాలో పర్యాటక మంత్రిగా ఉన్నారు.

మరో 8 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. యూపీఏ-2వ ప్రభుత్వానికి ఇదే చిట్టచివరి విస్తరణగా భావిస్తున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ చివరిసారిగా అక్టోబర్‌లో జరిగింది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్షికమం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగింది. కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, సహా పలువురు కేంద్ర కేబినెట్ మంత్రులు, నేతలు ఈ కార్యక్షికమానికి హాజరయ్యారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసినవారికి ప్రధాని మన్మోహన్ శాఖలను కేటాయించారు. జాట్ నేత అయిన శిష్‌రాం ఓలాకు గతంలో ఆయన నిర్వహించిన కార్మిక, ఉపాధి కల్పన శాఖను తిరిగి కేటాయించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. మొదటిసారిగా 1957లో రాజస్థాన్ అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు. సీపీ జోషి స్థానంలో ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు రోడ్లు రహదారుల శాఖ కేటాయించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. గిరిజావ్యాస్‌కు గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, దారిద్య్ర నిర్మూలన శాఖ ఇచ్చారు. చిత్తోర్‌గఢ్ నుంచి ఎంపీగా ఉన్న ఆమె.. గతంలో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా పని చేశారు. ఈ శాఖను గతంలో అజయ్ మాకెన్ నిర్వహించారు. ఆంధ్రవూపదేశ్‌లోని ఏలూరు నుంచి ఐదు సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన కావూరి సాంబశివరావుకు జౌళిశాఖ లభించింది. మహారాష్ట్ర గిరిజన నేత, 9 సార్లు ఎంపీగా గెలిచిన మాణిక్‌రావు గావిట్‌ను సామాజిక న్యాయం, సాధికారత శాఖకు సహాయ మంత్రిగా నియమించారు.

పంజాబ్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్న దళిత నాయకురాలు సంతోష్ చౌదరికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు. తమిళనాడుకు చెందిన నచియప్పన్‌కు వాణిజ్యం, పరిక్షిశమల శాఖ సహాయ మంత్రి అయ్యారు. ఈయన 2జీ కుంభకోణంపై నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీలో సభ్యుడు. రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారుల ప్యానెల్‌లోనూ సభ్యుడిగా ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, దళిత నేత జేడీశీలం ఆర్థికశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్లిఖార్జున ఖర్గేకు రైల్వే శాఖ అప్పగించారు. ఇప్పటికే ఆయన కేబినెట్ మంత్రిగా ఉండటంతో ప్రమాణం చేయలేదు. గత నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం నేపథ్యలో ముఖ్యమంత్రి పదవి రేసులో ఖర్గే పేరు బలంగా వినిపించింది. అయితే.. ఆ పోస్టును సిద్ధరామయ్యకు కేటాయించడంతో దానికి ప్రతిగా ఖర్గేను కీలకమైన రైల్వే శాఖకు మార్చారు. ఓలా, ఫెర్నాండెజ్ యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారు. యూపీఏ-2 ప్రభుత్వంలో వారికి అవకాశం దొరకలేదు. తాజాగా 8 మంది మంత్రుల చేరికతో కేంద్ర కేబినెట్ సంఖ్య 77కు చేరింది. ఒకవైపు మోడీని ముందు పెట్టుకుని బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ కూడా తన విజయావకాశాలను మెరుగుపర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీని పునర్వస్థీకరించుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ ద్వారా ఎన్నికలకు సమాయత్తమవుతున్నది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు సంపాదించిన అందరూ సోనియాకు అత్యంత నమ్మకస్తులు కావడం విశేషం

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.