ఆక్రమిత నగరంలో ఓ అనుభవం…-కట్టా శేఖర్ రెడ్డి

ఎప్పుడెప్పుడు ఇందిరాపార్కుకు చేరుకోవాలన్న ఆలోచనల ఆరా టం. ఆలోచనల కన్నా కాళ్లు వేగంగా పరుగెత్తాలన్న తపన. వృత్తి ధర్మంలో భాగంగా అక్కడ ఉన్న జర్నలిస్టు మిత్రులను, నిరసనకారులను కలవాలని ఆరాటం. మా ఎడిటర్ అల్లం నారాయణ, న్యూస్ ఎడిటర్ మార్కండేయ, నేను కలిసి మా ‘నమస్తే తెలంగాణ’ ఆఫీసు నుంచి బయలుదేరాం. సిటీ సెంటర్, ఆనంద్‌నగర్‌లను దాటి ఖైరతాబాద్ చౌరస్తా చేరుకున్నాం. దారులన్నీ మూసి ఉన్నాయి. ఎక్కడా దారిలేదు. ఇంతలో ఓ పోలీసాయన అరుపు. అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశం. అక్కడ ఉన్న పోలీసుల గుంపులో ఎవరో ఒక పోలీసు మా ఎడిటర్‌ను గుర్తుపట్టి, వారి అధికారికి చెప్పినట్లున్నాడు. అప్పుడు వారు మమ్ములను లక్డీకాపూల్ వైపు వెళ్లడానికి అనుమతించారు. లక్డీకాపూల్ రోడ్డుపై బయలుదేరాం. ఎదురుగుండా విసురుగా ఓ అంబుపూన్స్ వ్యాన్ వచ్చింది. మా మీదికి దూసుకొచ్చినంత పనిచేసింది. ఎలాగోలా తప్పించుకుని దానికి దారిచ్చి రోడ్డు పక్కకు తప్పుకున్నాం. ద్వారకా హోటల్ చేరామో లేదో.. మరో ముళ్ల కంచె. అక్కడ సెక్ర రోడ్డును మూసేశారు. అసెంబ్లీ వైపు వెళ్లే రోడ్డునూ మూసేశారు. అక్కడ ఉన్న పోలీసులకు తాము జర్నలిస్టులమని చెప్పుకునేందుకు ప్రయత్నించాము. కానీ మా మాట ఎవరూ వినే పరిస్థితిలో లేరు. మా మాటలు ఎవరూ పట్టించుకోలేదు. మాసాబ్ ట్యాంకు మీదుగా నాంపల్లి వైపు వెళ్లండని మమ్ములను ఆదేశించారు…చేసేది లేక..ఆ వైపు కదిలాం. అటు వైపు వెళ్లే రోడ్డుకు ఎడమవైపు ఉన్న రోడ్లన్నీ బారికేడ్లతో మూసేశారు. చివరికి మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ హాస్టల్ దగ్గరనుంచి నాంపల్లి వైపు రోడ్డు పట్టాము. విపరీతమైన ట్రాఫిక్. అంగుళం కదలడం కష్టంగా ఉంది. మా ప్రయాణం నత్తను తలపించింది. ఎంతో సేపటికి.. అష్టకష్టాలు పడి చివరికి గాంధీభవన్ రోడ్డు చేరాము.

మళ్లీ అవే బారికేడ్లు. అదే పోలీసు. ఎక్కడ చూసినా ఇనుపబూట్లే, మర తుపాకు లే. మనం ఎక్కడున్నాం? ఇది మన నగరమేనా? మనం ఈ నగర పౌరులమేనా..!? ఎక్క డో.. పరాయివారమై పోయామన్న ఫీలింగ్… బాధ పెరిగిపోతున్నది. మన నగరమే ఇప్పుడు మనది కాదు. దీన్ని ఆక్రమించారు. మొజాంజాహీ మార్కెట్ వైపు రోడ్డు వెంట కరాచీ బేకరీ వరకు వెళ్లి అక్కడ ఎడమ వైపు జీపీవో వైపు ముందుకు సాగాం. కొద్ది దూరం వెళ్లాక కుడివైపు రోడ్డు నుంచి బ్యాంకు స్ట్రీట్ వైపు వెళ్లాం. అక్కడి నుంచి గుజరాతీ బజార్ నుంచి పాత రాయల్ టాకీస్ రోడ్డును చేరుకున్నాం. అక్కడినుంచి ముందుకు కదులుతూ.. నారాయణగూడ చేరుకున్నాం. ఇక్కడినుంచి బడిచౌడీ రోడ్డు వెంబడి హిమాయత్‌నగర్ చేరుకున్నాము. రోడ్డు వెంబడి.. ఎడమ వైపు సెక్ర అసెంబ్లీ వైపు వెళ్లే రోడ్లన్నింటినీ బారికేడ్లతో మూసేశారు. పోలీసులు దడికట్టి నిలబడ్డారు. అలా చివరికి అశోక్‌నగర్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరికి చేరుకున్నాము. అక్కడున్న పోలీసులకు మా గుర్తిం పు కార్డులు చూపించి ఇందిరాపార్క్ రోడ్డులో ముందుకు సాగాము. చిట్ట చివరికి ఇందిరాపార్క్ చేరాం. అక్కడ మా కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టు సహచరులను కలిశాం. కశ్మీర్‌లో ప్రయాణిస్తున్నట్లు అనిపించింది. అందరి మొహాల్లో ఆందోళన. ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం.

ఒక్కో గాథ. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను అనామకున్ని బాదినట్టు బాదారని ఓ జర్నలిస్టు చెప్పాడు. కోదండరాంను కిందపడేసి తన్నారట! తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అమానుషంగా లాగి పడేశారని మరో మిత్రుడు చెప్పాడు. మహిళఅని కూడా చూడకుండా ఇంత దుర్మార్గమేంటని ఆ జర్నలిస్టు ఆశ్చర్యంతో, బాధతో అన్నాడు. ఇంకా గుండె తరుక్కుపోయే విషయమేమంటే.. పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా సీనియర్ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ బందోబస్తుకు వచ్చిన పోలీసులంతా.. ప్రాంతేతరులని మరో టీవీ జర్నలిస్టు అన్నాడు. వచ్చిన వాళ్లంతా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చారని అన్నాడు. అందుకోసమే పోలీసులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారన్నా డు. ఈ నా ప్రయాణంలో ఎదురైన అనుభవాలతో నేను ఊహిస్తున్నదంతా నిజమేననిపించింది. మనమిక్కడ పరాయివారమైపోయాం! విదేశీయులమయ్యాం!! మనలను నియంవూతించడం కోసం ప్రాంతేతరులను తీసుకొచ్చారన్నమాట. ఎంత విషాదం..! కష్టాలు, బాధలు ఎన్ని ఉన్నా పాలకులు, పోలీసుల ప్రవర్తన ఎలా ఉన్నా, ఎంత రెచ్చగొ ఉన్నా.. తెలంగాణ ప్రజలు భూదేవంత సహనం ప్రదర్శించారు. ఎక్కడా.. అసహనంతో.. హద్దులు దాట లేదు. శాంతియుత మార్గాన్ని వీడ లేదు. లక్ష్యం నెరవేరినందుకు ఊపిరి పీల్చుకున్నాను.

-కట్టా శేఖర్‌రెడ్డి

This entry was posted in ARTICLES.

Comments are closed.