ఆకాశ వీధిన అద్భుతం.. ఇస్రో చారిత్రక విజయం

-జీఎస్‌ఎల్వీ డీ5 ప్రయోగం సక్సెస్.. భూ కక్ష్యలో చేరిన జీశాట్-14 ఉపగ్రహం
-సొంత క్రయోజనిక్ ఇంజిన్‌తో ఇస్రో మొదటి విజయం
-20ఏళ్ల కల నెరవేరింది: రాధాకృష్ణన్.. ప్రముఖుల అభినందనలు

-జీఎస్‌ఎల్వీ డీ 5 రాకెట్ నిర్మాణ వ్యయం రూ.173 కోట్లు
-జీశాట్-14 వ్యయం రూ.45 కోట్లు
-ఉపవూగహం బరువు 1,983 కిలోలు
-జీశాట్‌తో కలుపుకొని మొత్తం రాకెట్ బరువు 415 టన్నులు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం నిర్వహించిన జీఎస్‌ఎల్వీ డీ5 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం సాయంత్రం 4.18 గంటలకు జీశాట్ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్వీ డీ5 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 16 నిమిషాల 50 సెకన్లలో ఉపగ్రహాన్ని భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దేశీయంగా తయారుచేసిన క్రయోజనిక్ ఇంజిన్‌తో నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతం కావటంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానం కోసం 20 ఏళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం లభించిందని ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. జీఎస్‌ఎల్వీ డీ5 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితరులు అభినందించారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. 20 ఏళ్లుగా సొంత క్రయోజనిక్ ఇంజిన్ కోసం తహతహలాడుతున్న ఇస్రో కల నెరవేరింది. దేశీయ క్రయోజన్ ఇంజిన్‌తో ఆదివారం నిర్వహించిన జీఎస్‌ఎల్వీ డీ5 ప్రయోగం విజయవంతమైంది. కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-14ను మోసుకొని జీఎస్‌ఎల్వీ డీ5 సగర్వంగా నింగిలోకి ఎగిరింది. ఈ విజయం ద్వారా ప్రపంచంలో అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్ తర్వాత సొంతంగా క్రయోజనిక్ ఇంజిన్ తయారు చేసిన ఆరో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం సాయంత్రం 4.18 నిమిషాలకు నింగిలోకి ఎగిరిన జీఎస్‌ఎల్వీ డీ5 రాకెట్ 16 నిమిషాల 50 సెకన్లలో 1,982 కిలోల బరువున్న జీశాట్-14 ఉపక్షిగహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయో గం ద్వారా ఇస్రో స్వయం గా తయారు చేసిన క్రయోజనిక్ ఇంజిన్‌ను పరీక్షించటం, జీశాట్-14ను నిం గిలోకి పంపటం అనే రెండు లక్ష్యాలు పూర్తిగా నెరవేరాయి. స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్‌ను ఉపయోగించి గత ఏడాది ఆగస్టు లో నిర్వహించిన ప్రయో గం ఇంధన లీకేజీ కారణంగా చివరిక్షణంలో వాయిదా పడగా, రెండో ప్రయత్నంలో ఇస్రో ఘనవిజయం సాధించింది. సుదీర్ఘకాలంపాటు పడిన శ్రమకు ఫలితం దక్కడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

p2gslv2ప్రయోగ విశేషాలు
-దేశంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిర్వహించిన జీఎస్‌ఎల్వీ డీ5 ప్రయోగానికి మొత్తం రూ.356 కోట్లు ఖర్చయింది.
– జీఎస్‌ఎల్వీ రాకెట్ నిర్మాణ వ్యయం రూ.173 కోట్లు.
– జీశాట్ వ్యయం రూ.45 కోట్లు.
– ఉపగ్రహం బరువు 1,983 కిలోలు.
– జీశాట్‌తో కలుపుకొని మొత్తం రాకెట్ బరువు 415 టన్నులు.

జీశాట్ ప్రయోజనాలు….
కమ్యూనికేషన్ ఉపగ్రహాల కొరతతో అల్లాడుతున్న భారత్‌కు జీశాట్-14 ప్రయోగం అనేక ప్రయోజనాలు కల్పించనుంది.
– జీశాట్-14 సమాచార రంగంలో 12 ఏళ్లపాటు సేవలందిస్తుంది.
– ఇందులో 14 శక్తిమంతమైన ట్రాన్స్‌పాండర్లున్నాయి.
– వీటిలో ఆరు సీ బాండ్, ఆరు కేయూ బాండ్, 2 కేఏ బాండ్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి.
– ఈ ట్రాన్స్‌పాండర్ల సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ రంగంలో విదేశాలపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది.
– కొత్తరకం వైజ్ఞానిక ప్రయోగాలకు జీశాట్-14 వేదిక కానుంది.
– ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే జీశాట్-6, 6ఏ, 7ఏ, 9, చంద్రయాన్ రెండు రిమోట్‌సెన్సింగ్ ఉపక్షిగహాల ప్రయోగానికి ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది.
– టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ తదితర రంగాల అభివృద్ధికి జీశాట్-14 ఊతమిస్తుంది.
– ఈ ఉపక్షిగహాన్ని భూమికి 74 డిగ్రీల తూర్పు లాంగిట్యూడ్ దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇదే ప్రదేశంలో ప్రస్తుతం ఇన్‌శాట్-3సీ, ఇన్‌శాట్-4సీఆర్, కల్పన-1 ఉపగ్రహాలు సేవలందిస్తున్నాయి.
– సొంతంగా క్రయోజనిక్ ఇంజిన్‌ను సమకూర్చుకోవటం, తక్కువ ఖర్చుతో ప్రయోగాలు నిర్వహిస్తుండటంతో భారత్ భవిష్యత్తులో శాటిలైట్ ప్రయోగాలకు కేంద్రంగా మారనుంది.
– ఇస్రో వర్గాల సమాచారం ప్రకారం 2020 నాటికి 927 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందులో 405 సమాచార ఉపక్షిగహాలే ఉంటాయి.
– 1999-2013 మధ్య జర్మనీ, కొరియా, ఇటలీ, జపాన్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలకు చెందిన 35 ఉపక్షిగహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.

ISRO-Teamమార్చిలో పీఎస్‌ఎల్వీ సీ24 ప్రయోగం!
జీఎస్‌ఎల్వీ డీ5 ప్రయోగం విజయవంతం కావటంతో పట్టరాని ఆనందంతో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు రెండు నెలల్లోనే మరో ప్రయోగం నిర్వహించాలని ప్రణాళికలు వేస్తున్నారు. మార్చి నెలలో పీఎస్‌ఎల్వీ సీ24 రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లను వేగవంతం చేయనున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మార్చిలో ఈ ప్రయోగం జరుగుతుందని ఇస్రో ప్రతినిధి తెలిపారు.

చారివూతక విజయం
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్వీ) రాకెట్లను ప్రయోగించటంలో తిరుగులేని విజయాలు సాధించిన ఇస్రో, జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్వీ) ప్రయోగాల్లో మాత్రం చెప్పుకోదగ్గ సత్ఫలితాలు సాధించలేకపోయింది. సొంతంగా తయారు చేసిన క్రయోజనిక్ ఇంజిన్‌తో 2001 నుంచి ప్రయోగాలు చేస్తున్న ఇస్రో ఎనిమిదవ ప్రయత్నంలో తిరుగులేని విజయం సాధించింది. గతంలో నిర్వహించిన ఏడు జీఎస్‌ఎల్వీ ప్రయోగాల్లో నాలుగుసార్లు రాకెట్ నింగిలోకి ఎగిరినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. తాజా విజయంతో ఉత్సాహంతో ఉరకలేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు, త్వరలో చేపట్టబోయే చంద్రయాన్ ప్రయోగాన్ని స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్‌తో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం నింగిలోకి ప్రవేశించిన జీశాట్ ఉపగ్రహం భారత జియోస్టేషనరీ సమాచార శాటిలైట్లలో 23వది.

20 ఏళ్ల కల నెరవేరింది: రాధాకృష్ణన్
సొంతంగా క్రయోజనిక్ ఇంజిన్‌ను తయారు చేసుకోవాలన్న 20 ఏళ్ల తమ కల నెరవేరిందని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తెలిపారు. జీఎస్‌ఎల్పీ డీ5 ప్రయోగం విజయవంతమైన తర్వాత ఆయన మాట్లాడుతూ ఇస్రో బృందం గొప్ప విజయం సాధించిందని ప్రకటించారు. ప్రయోగం విజయవంతం కావటంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన, స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ తాము ఊహించినట్లుగానే పనిచేసిందన్నారు. దేశానికి అత్యంత అవసరమైన జీశాట్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్వీ రాకెట్ నిర్ధేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిందని ప్రకటించారు.

శభాష్.. ఇస్రో
-శాస్త్రవేత్తలకు ప్రముఖుల అభినందనలు
జీఎస్‌ఎల్వీ డీ5 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ అభినందించారు. సొంతంగా తయారు చేసిన క్రయోజనిక్ ఇంజిన్‌తో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించటం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో అతిముఖ్యమైన క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్ కూడా చేరిందని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తమ అభినందన సందేశాల్లో పేర్కొన్నారు. గొప్పతనమంతా అంకితభావంతో కష్టించి పనిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లదేనని తెలిపారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.