ఆంధ్రా మీడియా టెర్రరిజం-పాశం యాదగిరి

తెలంగాణ బిడ్డలారా!

తెలంగాణను ఆరు దశాబ్దాల దోపిడీ, వివక్ష, అణచివేత, అవమానాల నుంచి వెరసి అంతర్గత వలసవాదం నుంచి విముక్తి చేయడానికి ఉద్యమం ఎంత ఉధృతంగా సాగుతున్నదో తెలంగాణ ఆలోచనలను ఆగం చేయడానికి మీడియా కుట్రలు కూడా అంతే ఉధృతంగా సాగుతున్నాయి.
విలీనం సమయంలో తెలంగాణకు ఇచ్చిన పెద్ద మనుషుల ఒప్పందం సహా అన్ని ఒప్పందాలను, అన్ని ఫార్ములాలను, రక్షణలను, జీవోలను ఏ ఒక్కటీ అమలు చేయకపోయినా ఏనాడూ ప్రశ్నించని మీడియా తెలంగాణ రాష్ట్రం కోరితే పంచ మహా పాతకాలు అంటగడుతున్నది. తెలంగాణ వనరులు దోచుకుని ఆర్థికంగా బలిసి, రాజకీయాధికారాన్ని వినియోగించుకొని అక్రమంగా సంపద కూడగట్టుకున్న మాఫియా క్రమంగా పత్రికలను, టీవీ చానెళ్ళను, ఎఫ్.ఎం.రేడియోలను, ప్రచురణ సంస్థలను, సినీ పరిక్షిశమను ఆరంభించింది. ఈ టీవీ చానెళ్ళు, పత్రికలు అన్నీ అత్యధికం ఒకే సామాజిక వర్గానికి చెందినవి. గతంలో తెలంగాణకు సంబంధించి అబద్ధాలను, అర్ధసత్యాలను వండి వార్చి దినపవూతికలలో వడ్డించిన ఆంధ్రా మాఫియా తెలంగాణకు చెందిన ఒక మహా మేధావిని అసమర్థునిగా, చెన్నా రెడ్డి వంటి సమర్థుడిని అవినీతిపరుడిగా, అంజయ్య వంటి మానవతావాదిని జోకరుగా చిత్రించింది. ఎన్టీఆర్ వంటి అజ్ఞానిని మహావక్తగా శ్లాఘించింది. అజ్ఞానులైన ఆంధ్రా ముఖ్యమంవూతులను ఆకాశానికి ఎత్తింది. అరవైయేండ్ల కాల నిడివిలో తొంభై శాతం ఆంధ్రా ముఖ్యమంవూతులే ఉండగా, వారి హయాంలో అన్ని రాయితీలు అనుభవించి తెలంగాణ ముఖ్యమంత్రి ఏడాదే పదవిలో ఉన్నా గద్దె కూల్చేదాకా మీడియా అసహనాన్నే ప్రదర్శించింది. తెలంగాణ వ్యక్తి ఐదేండ్లు కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపొచ్చు. కాని ఆంధ్రవూపదేశ్‌లో ఏడాది కూడా ముఖ్యమంత్రి గద్దె మీద మీడియా కూర్చోనీయదు. టీవీ చానెళ్ళు, కేబుల్ నెట్‌వర్క్‌లు ఆంధ్రా మాఫియా చేతుల్లో ఉండడంతో వీరి ‘థాట్ పోలిసింగ్’ (తెలంగాణ వారి ఆలోచనలను ఆంధ్రకు అనుకూలంగా మళ్ళించడం) పగ్గాలు లేకుండా సాగుతున్నది. చానెళ్ళ యజమానులు, ఎడిటర్లు, సీఈవోలు, యాంకర్లు అందరూ ఆంధ్రావారే. పచ్చి తెలంగాణ వ్యతిరేకులే.

ఈ చానెళ్ళు జల చౌర్యాన్ని తప్పు పట్టవు. గోదావరి బేసిన్ నీళ్లను కృష్ణా బేసిన్‌కు తరలించి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇచ్చినా, కృష్ణా బేసిన్ నీళ్ళను పోతిడ్డి పాడు ద్వారా పెన్నా బేసిన్‌కు పారించి బ్రాహ్మణి స్టీల్స్‌కు ఇచ్చినా ప్రశ్నించవు. ఓ నది బేసిన్ నీళ్ళను మరో నది బేసిన్‌కు ఎత్తిపోయడం ప్రకృతి విరుద్ధము, ప్రజా వ్యతిరేకమని , ఆర్థిక సూత్రాల ఉల్లంఘన అని నీటిని దొంగిలించడమేనని ఏ ఆంధ్రా మీడియా రాయదు, కూయదు. సింగరేణి ఓపెన్ కాస్ట్ విధ్వంసాన్ని, జన విస్థాపనాన్ని విమర్శించదు. రింగు రోడ్ల కింద 70 ఊళ్ళు ఖాళీ అయితే ప్రజల ఆక్రందనలను వినదు, వినిపించదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని 2009 డిసెంబర్ 9న ఆ మరునాడు దేశీయాంగమంత్రి చిదంబరం పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి గంగలో కలిపిన విషయం ఏ టీవీ ప్రస్తావించదు. హత్య చేసిన వాడి కత్తిని చూపించకుండా చావు కేక పెట్టిన వాడితే నేరమని గగ్గోలు పెడుతుంది. తెలంగాణకు విషం చిమ్మే ఆంధ్రా టీవీ చానెళ్ళలో చర్చల సరళి ఎట్లా ఉంటుందో గమనిద్దాం-

మొదట చర్చనీయాంశమే తెలంగాణకు వ్యతిరేకం. చర్చలో పాల్గొనే అతిథులు అంతా విశాలాంవూధవాదులే ఉంటారు. వారు అజ్ఞానులైనా, అవినీతిపరులైనా, ప్రజా కంటకులైనా, చరిత్ర హీనులైనా చానళ్ళకు పట్టదు. ప్రశ్నలు కూడా తెలంగాణకు వ్యతిరేకమైనవే. తెలంగాణ తరఫున మాట్లాడడానికి ఒక అమాయక ప్రాణిని పిలుస్తారు. 1:4 నిష్పత్తిలో వాగ్వివాదం సాగుతుంది. నోరు లేని తెలంగాణ వాదనలో పసలేదని అంతా కలిసి తేలుస్తారు. తెలంగాణ వాదాన్ని బొంద పెట్టడానికి యాంకర్లు అనేక వంచనా కళలతోపాటు అబద్ధాన్ని నిజంగా నమ్మబలకగల మాటకారితనంలో శిక్షణ పొందుతారు.

ఆ శిక్షణ ఎటువంటిదో పరిశీలిద్దాం- 
1.వక్రీకరణలు, వక్రభాష్యాలలో పాటవం 2.అమాయక యువతులను మోసం చేయడం. 3.కంపెనీలను, రాజకీయ నాయకులను, చివరికి సొంత చానెళ్ళను కూడా బ్లాక్‌మెయిల్ చేయడం. 4.ఆషాఢభూతిగా ధర్మ పన్నాలు వల్లించడం 5.కోట్ వేసుకుని నల్ల డై రుద్దుకుని వయసు దాచుకోవడం, ధోతి కట్టుకుని, తెల్లడై వేసుకుని వయస్సు పెంచుకోవడం.

6. ఆంధ్రా వారి తప్పులను చిన్నవి చేయడం, తెలంగాణ వారి నిస్సహాయతను భూతద్దంలో చూపడం, ఆంధ్రా నాయకులను అమాయకులు అనడం, తెలంగాణ నాయకులను మూర్ఖులు అనడం. 7. తెలంగాణవాది ఎవరైనా ఆత్మ విశ్వాసంతో వాస్తవాలను గట్టిగా వాదిస్తే ‘రైట్.. రైట్’ అని మైక్ కట్ చేయడం8. చర్చ ఆంధ్రావారికి ప్రతికూలంగా మారుతుంటే వేరే అంశంలోకి మళ్ళించడం. 9. తటస్థంగా ఉండవలసిన యాంకర్ న్యాయమూర్తి పాత్రను నిర్వర్తించడం, నీతి బోధలు చేయడం 10. తెలంగాణ వాది వాస్తవ గణాంకాలు ఉటంకిస్తుంటే ‘చాలు.. చాలులే’ అని గొంతు పెంచడం, గద్దించడం, చివరికి గుడ్లురమడం. 11. వ్యంగ్య వైభోగంతో అన్యాపదేశంగా నోరు మూయించడం 12. అమాయకులైన తెలంగాణ ప్రజలను నాయకులు అమ్ముకుంటున్నారని దొంగ సానుభూతి చూపి అవమానించడం.13. తెలంగాణవాదిని అంతా కలిసి పరిహాసమాడి అవమానించడం.14. మీ లాంటి మంచివారు కూడా ఇంత సంకుచితంగా మాట్లాడుతారా అని ఆత్మవిశ్వాసం లేని వారిని బోల్తా కొట్టించడం

15. డొంక తిరుగుడు వంకర వాదంతో చర్చను ఆంధ్రావాదానికి అనుకూలంగా మళ్లించడం 16. తెలంగాణవారి లేని తప్పులను చూపి వారి ఔన్నత్యాన్ని కించపరచడం 17 అబద్దాలు, అసత్యాలు.. వాటి కన్నా ప్రమాదకరమైన అర్ధ సత్యాలను చెప్పి, తెలంగాణ వాదికి యాంకర్ పట్టుబడినప్పుడు అర్ధంతరంగా బ్రేక్ చెప్పి చర్చ మళ్ళీ ప్రారంభించినప్పుడు వేరే అంశాన్ని చర్చించడం. 18. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతుంటే- ఆ సన్నివేశాలు చూపకుండా నటి శ్రీయ పెండ్లి ఎప్పుడు?, ప్రియమణి బాయ్ ఫ్రెండ్‌ను మార్చిందా? మొదలైన ముచ్చట్లపై గంటల కొద్ది గడపడం.

19. సమైక్యవాదుల మానవ హారం అంటూ కొండంత రాగం తీసి నలుగురినే చూపించి అతిశయోక్తులు వల్లించడం. 20. తెలంగాణ సభల్లో లక్షలాది మంది ఉన్నా వారిని చూపకుండా, వేదికలను మాత్రమే చూపడం. 21. ఆంధ్రావాదులను ఉద్యమకారులుగా కీర్తించడం, తెలంగాణవాదులను దుండగులుగా ఈసడించడం. 22. లక్షలాది ప్రజలున్న వరంగల్ సభ లాంగ్ షాట్ చూపించి, విశాఖలో సమైక్యవాదుల వేదికగా దాన్ని వక్రీకరించడం. 23. ఆంధ్రా నాయకుల అవినీతిని చర్చించినప్పుడు రాజకీయమం అంత అని సాధారణీకరించడం. ఆంధ్రా నాయకులు పేర్లు చెబుతుంటే పేర్లు అప్రస్తుతం అని అడ్డు తగలడం, తెలంగాణ నాయకుల పేర్లు చెప్పినప్పుడు నిర్దిష్టీకరణ చేయడం.24.వాస్తవవాదానికి మసిరుద్ది అవాస్తవాల కనికట్టు ప్రదర్శించడం.

25. ఆంధ్రా నాయకుల చౌకబారు ఎత్తుగడలను చూసీ చూడనట్టు నటించడం. 26. తెలంగాణ విద్యార్థులు రాళ్ళు పట్టడాన్ని పదే పదే చూపించి దుశ్చర్యగా రూఢీ పరచచూడడం27. పోలీసులు గత్యంతరం లేక కాల్పులు జరిపారని తీర్పరి పాత్ర నిర్వర్తించడం. 28. పోలీసులు ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్ళలో దూరి అసభ్యంగా ప్రవర్తిస్తే ఒక్క ముక్క కూడా చెప్పకపోవడం.
29. విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు ఆంధ్రా వ్యాపారుల సంస్థ (ఎన్‌బిఎ) చెప్పిందని ప్రసారాలు నిలిపివేయడం.30. తప్పుడు గణాంకాలు ఇవ్వడం, ఏకపక్షంగా వ్యవహరించడం, సాధికారత ఆపాదించుకోవడం. 31. యాంకర్ చెప్పేది అసత్యం అని తేలితే అమాయకత్వం నటించడం, చర్చను గందరగోళ పరచడం. 32. తెలంగాణవాదాన్ని సంకుచిత వేర్పాటువాదమని కించపరిచి, ఆంధ్రా వాదాన్ని సమైక్యవాదంగా కీర్తించడం. 33. తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించే వారిని కాకుండా,అజ్ఞానులను, అవకాశవాదులను, ప్రచారం మోజు తప్ప సత్తాలేని వారిని, ప్రజాబలం లేనివారిని, బ్లాక్‌మెయిల్‌కు గురయ్యే నైతిక బలహీనులను ఎంపిక చేసి పిలుస్తారు.

పెద్ద నాయకులను కూడా జనం ముందు నిలబెట్టి, భయపెట్టి ‘నాకేమీ తెలువదు, నీవే మేధావివి’ అని చెప్పించుకుంటారు. 34. వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తారు, ఉద్రేక పరుస్తారు. 35. ‘నీ పెండ్లాన్ని కొట్టడం ఎప్పుడు మానివేశావ్’ అని ప్రశ్నించి ముద్దాయిని చేయ డం. ‘నీ భర్త నిన్ను ఎట్లా భరిస్తున్నాడు’ అని ఈసడించడం. శీల హననం ద్వారా ఇబ్బందికర పరిస్థితి నుంచి యాంకర్ తప్పించుకోవడం. 36. పత్రికా స్వాతంత్య్రం పేరిట అసత్య ప్రచారం చేయడం. ఉదా- కె.కె. రాజీనామా వాపస్ తీసుకుంటున్నాడు అంటూ చానెళ్ళు నల్లికుట్ల గిల్లుడు మొదలు పెడుతాయి. కడుపు మండి కోప్పడితే పత్రికా స్వాతంత్య్రం అంటూ గగ్గోలు పెడుతాయి.రాజీనామాలు తొందరపాటు, హై కమాండ్ కోపానికి గురైనా ప్రజలకు దగ్గర కాలేదని తెలంగాణ నేతలను ఒంటరి చేయజూస్తాయి. 37. తెలంగాణ వ్యతిరేక వార్తలను రోజంతా చూపిస్తాయి. అనుకూల వార్తలను కొన్ని సెకన్లు మాత్రమే చూపిస్తాయి. 38. మాయావతి, మమతాబెనర్జీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే వ్యతిరేకించినట్టు వక్రీకరిస్తాయి. 39. తెలంగాణవాదంపై దొంగ సర్వేలు ప్రసారం చేస్తాయి. ఏ సంస్థ ఎప్పుడు సర్వే చేసిందో, ఎంత మందిని ప్రశ్నించిందో వివరాలు చెప్పరు. 40. విశ్వసనీయ సమాచారం అంటూ కల్పితాలు ప్రసారం చేస్తాయి.

తెలంగాణ ఉద్యమంపై బురద జల్లే, తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే, తప్పుదోవ పట్టించే ఇటువంటి మీడియా నుంచి తెలంగాణను కాపాడుకోవడం తక్షణ కర్తవ్యం. 1969 ఉద్యమ కాలంలో ఈ వికృత మీడియా లేనందువల్లనే అప్పుడు ఆత్మహత్యలు జరగలేదు. పరాయి మీడియా ఎప్పుడూ పరతంవూతాన్ని తెచ్చి పెడుతుంది. మీడియా రంగంలో విదేశీ పెట్టుబడుల మీద 1955లో నిషేధం విధించడానికి కారణం ఉన్నది. మీడియా రంగంలో విదేశీ పెట్టుబడులు ప్రవేశిస్తే విదేశీ గుత్త సంస్థలు మార్కెట్‌పై ఆధిపత్యం కోసం మీడియాపై సొంత ఎజెండా రుద్ది భారత రాజకీయాలనే శాసిస్తాయని అప్పుడే ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆందోళన వ్యక్తం చేసిండు. సరిగ్గా ఆంధ్రా అంతర్గత వలస పాలనలో ఆంధ్ర సంపన్న వర్గాలు తమ మీడియా ద్వారా తెలంగాణ వ్యతిరేక భావజాలం వ్యాప్తి చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, భారత రాజకీయాలను శాసిస్తున్నాయి. అందుకే గాంధీజీ బాటలో విదేశీ వస్తు బహిష్కారాన్ని చానెళ్ళ నిషేధంతో ఆరంభిద్దాం. ఆంధ్రా చానెళ్ళను బందు పెట్టి మన తెలంగాణ చానెళ్లను, ఇతర భాషల తటస్థ చానెళ్ళనే చూద్దాం.

– పాశం యాదగిరి,
సీనియర్ జర్నలిస్ట్

This entry was posted in MEDIA MUCHATLU.

Comments are closed.