ఆంధ్రా ఉద్యోగులు.. ఆంధ్రా ప్రభుత్వానికి పోవాల్సిందే

-అక్కడున్న మనవాళ్లు ఇక్కడికొస్తారు
-టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన
-తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది
-బిల్లు పాసయ్యాక అంబరాన్నంటే సంబరాలు
-కేసీఆర్‌ను సన్మానించిన టీఎన్జీవో నాయకులు
-కేసీఆర్ వ్యాఖ్యలను వక్రీకరించిన సీమాంధ్ర చానెళ్లు
-అపార్థాలు పెంచేలా దుష్ప్రచారం కొనసాగింపు
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాకు పోవాల్సిందే. వారికి వేరే ఆప్షన్ లేదు. ఎవరి గవర్నమెంట్‌లో వారే ఉంటారు. అక్కడ కూడా ప్రభుత్వం నడవాలి కదా.. ఇక్కడివాళ్లు అక్కడికి వెళ్తారు.. chandrashe
అక్కడ మనవాళ్లువరైనా ఉంటే ఇక్కడికి వస్తారు’ అని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇప్పిస్తానని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయిస్తానని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు ఇప్పిస్తానని చెప్పారు. పెన్షనర్లకు కూడా కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లనే ఇప్పిస్తామన్నారు. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో తెలంగాణ ఎన్జీవోలు శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ను సన్మానించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన తెలంగాణ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్రను అభినందించారు. సకల జనుల సమ్మె చేసే సమయంలో జీతాలు ఇవ్వం మీ ఇష్టం అని ఉద్యోగులను బెదిరించారని, అయినా ఒక్క నెల ఎలాగైనా కష్టపడండి.. తెలంగాణ వచ్చిన తరువాత మీ జీతాలను మిత్తితో ఇప్పిస్తానని గతంలో హామీ ఇచ్చానని చెప్పారు. ఒక దశలో వాటర్‌బోర్డులో మూడు ప్రమోషన్లు ఇచ్చే సందర్భంలో మూడు తెలంగాణవారికే రావాల్సి ఉందని, అయితే అధికారులు వెంటనే డిప్యుటేషన్ మీద రాయలసీమ నుంచి ఉద్యోగులను దింపారని, దీనిపై తనకు సమాచారం అందితే వెంటనే నాయిని నర్సింహారెడ్డి, మరికొందరు నాయకులను పంపి ఆందోళన చేయించానని చెప్పారు.

వెళ్లిన నాయకుల అండతో ఉద్యోగులు ఆందోళనకు దిగి అద్దాలు పగలకొడితే అక్కడి నుంచి అధికారుల తనకు ఫోన్‌చేసి దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారని, అది దౌర్జన్యం కాదు వెంటనే తెలంగాణవారికి రావాల్సిన ప్రమోషన్లు ఇవ్వాలని తాను ఆనాడు చెప్పానని తెలిపారు. కేవలం ఐదు నిమిషాల్లో తెలంగాణవారికి ప్రమోషన్లు దక్కాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంపై దాడి మామూలుగా జరగలేదని, అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రమోషన్లు ఇస్తామని తెలిపారు. 1969 ఉద్యమంలో ఉద్యోగులను భయపెట్టి, ఒత్తిళ్లు చేసి జైళ్లలో పెట్టారని, తాను ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో ఉద్యోగులను రంగంలోకి దించకుండా రెండుమూడేళ్ల తరువాత వారిని ఉద్యమంలో భాగస్వామ్యం చేశానని అన్నారు. ‘దుర్మార్గంగా 14ఎఫ్‌ను తెచ్చారు. సిద్దిపేటలో లక్షలాది మంది ఉద్యోగులు హాజరయ్యారు. ఆ ఉద్యోగ గర్జనలో నేను జాగోబాగో అనలేదు. అన్నట్లుగా మీడియాలు వక్రీకరించాయి. అన్యాయంగా, అక్రమంగా ఉద్యోగాలను అక్రమించినవారినే బాగో అన్నా’ అని కేసీఆర్ వివరించారు. సీమాంవూధలో కేసీఆర్ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారని, అవన్నీ తనకు దీవెనలే అవుతాయని అన్నారు. ఇప్పటికి కేసీఆర్‌ను పదిలక్షల తిట్లు తిట్టారని అన్నారు.

‘తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేస్తే దీక్ష చేస్తా అన్నా.. అన్నట్లే దీక్షకు పోయిన. దీక్షకు ముందు తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ఉద్యోగులతో చర్చించిన. దీక్ష సమయంలో ఉద్యోగులు పెన్‌డౌన్ చేయాలని పిలుపునిస్తే ఉద్యోగులంతా అద్భుతంగా కదిలారు’ అని కేసీఆర్ అన్నారు. తాను దీక్ష చేస్తున్న సమయంలో శరీరం ఆధీనంలో ఉందా లేదా అని పరీక్షించుకునేందుకు బాత్‌రూంకు వెళ్లేవాడినని, 11వ రోజు వెళ్లేటప్పుడు పరిస్థితి విషమిస్తున్నట్లుగా అనిపించిందని చెప్పారు. అదేరోజు కేంద్రం నుంచి హోంమంత్రి ఫోన్ చేస్తే నాకు వాయిస్ రాలేదని, పక్కనే ఉన్న జయశంకర్‌గారే మాట్లాడారని తెలిపారు. అదేరోజు రాత్రి 11.20నిమిషాలకు కేంద్రం ప్రకటన చేస్తే 24గంటల్లోనే కుట్ర చేసి అడ్డుకున్నారని చెప్పారు. ఆ తరువాత జరిగిన పరిణామాలపై తెలంగాణ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు అంతా ఉద్యమంలోకి వచ్చారని చెప్పారు. ‘మీ బిడ్డగా ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నా. తెలంగాణ ప్రకటన రావడం ఆలస్యమైంది. అయినా తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు ప్రశాంతంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమలుజరిగేవరకు పోరాటం చేయాలి. వచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అనుకూల ప్రభుత్వంగా (ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ) ఉంటుంది.

ఉద్యోగులను వేధించేందుకు పెట్టిన ఏసీబీ కేసులను ఎత్తేస్తాం’ అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్ తెలంగాణ సాధన ఇంక్రిమెంట్‌గా ఇస్తామని చెప్పారు. సింగరేణిలో సమ్మె సమయంలో ఒక్క బొగ్గురవ్వను కూడా బయటకు రానివ్వకుండా ఉద్యమించారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రగతిలో నంబర్‌వన్ అవుదామని అన్నారు. ఇప్పుడు విముక్తి కాబోతున్నామని, అందరిని సమన్వయం చేసుకుంటూ దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకుందామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత, బీసీ, మైనార్టీల ముఖాల్లో చిరునవ్వులు వచ్చేవరకు అలుపెరుగని పోరాటం చేస్తానని, తెలంగాణకు ఎన్నో వనరులు, రెవెన్యూ ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు కళ్ల చూసేందుకు కృషి చేస్తానని, తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుదామని అన్నారు. తెలంగాణ కల సాకారమయ్యే సమయం ఆసన్నమైందని, ఒక్కొక్క అడుగు ముందుకు పడుతోందని అన్నారు. ఒక పుష్కరకాలంపాటు పోరాటాలు చేశామని, తప్పకఇవ్వని అనివార్యతను సృష్టించామని అన్నారు. అయినా ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, బిల్లు పాస్ అయ్యేంతవరకు పోరాటం చేయాలని అన్నారు.

ఇప్పటికే అనేక బిల్లులు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్నాయని, మహిళా బిల్లు, ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ బిల్లు ఇలా అనేకం పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ బిల్లు పాస్ అయిన తరువాత అంబరాన్ని అంటే సంబరాలు చేసుకుందామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె అద్భుత ఘట్టమని, ఉద్యోగులు అయి ఉండీ జీతాలు రావని తెలిసీ కూడా ఉద్యమంలోకి వచ్చారని ప్రశంసించారు. బంద్ అంటే బంద్ చేశారని, దసరా, బతుకమ్మ పండుగలను కూడా కోల్పోయి ప్రపంచంలోనే ఎక్కడా జరగనటువంటి సకల జనుల సమ్మె చేశారని గుర్తుచేసుకున్నారు. ఈ సమావేశంలో టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు దేవీవూపసాద్, రవీందర్‌డ్డి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్షికమంలో ఆంధ్రా ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ అన్న మాటలను ఆంధ్రా చానెళ్లు వివాదాస్పదం చేశాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటయినప్పుడు అక్కడ కూడా ఉద్యోగుల అవసరం ఉంటుంది కదా.. ఆంధ్రా ఉద్యోగులు వెళ్ళాల్సి వస్తుందన్న మాటలను అపార్థం ధ్వనించేలా, అభ్యంతరకర వ్యాఖ్యలన్న రీతిలో వక్రీకరించి ప్రచారం కొనసాగించాయి. తెలంగాణపై ఇప్పటివరకు అనుసరిస్తున్న తీరు మారలేదని మరోమారు స్పష్టం చేశాయి.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.