ఆంక్షలు లేని తెలంగాణనే ఒప్పుకుంటాం: కేసీఆర్

 

ఢిల్లీ : ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రాన్నే ఒప్పుకుంటామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జీవోఎంకు స్పష్టం చేశారు. ఆ పార్టీ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావుతో కలిసి మంగళవారం సాయంత్రం జీవోంఎతో భేటై నివేదికను సమర్పించారు. గంటకు పైగా సమావేశమైన వీరు మంత్రుల కమిటీకి పలు అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. అఖిలపక్షభేటీకి తమను జీవోఎం పిలిచిందని, వారి ఆహ్వానం మేరకు ఇవాళ జీవోఎంను కలవడానికి వచ్చామన్నారు. గత కొంత కాలంగా వస్తున్న వార్తల బట్టి హైదరాబాద్‌పై లాఅండ్ ఆర్డర్.. ఇంకొటని… ఎలాంటి ఆంక్షలు పెట్టినా తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని, అది రాజ్యాంగవ్యతిరేకమన్నారు. హైదరాబాద్‌ను ఐదేళ్లే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరినట్లు చెప్పారు.

మిగిలిన రాష్ట్రాలకు ఎలాంటి విధివిధానాలు ఉన్నాయో, తెలంగాణ రాష్ట్రంకు అలాగే ఉండాలని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి తెలంగాణను కోరుతున్నారో జీవోఎంకు వివరించమన్నారు. బిల్లుకు కొద్ది రోజుల ముందు అన్ని పార్టీలను కలిసి మద్దతు కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. బిల్లు పాసైన తరువాతే తమ పార్టీ విలీనంపై నిర్ణయం ఉంటుందన్నారు.

అఖిలపక్షంకు టీడీపీ రాకపోవడంపై కేసీఆర్ తప్పుపట్టారు. చంద్రబాబు డిమాండ్ లేకుండా ఢిల్లీలో దీక్ష చేసిన వ్యక్తి అని, ఆయన మతి తప్పినట్లుందని కేసీఆర్ విమర్శించారు. డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని భావిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.