ఆంక్షలతో కాదు ఆకాంక్షల తెలంగాణ కావాలి

ఆంక్షలతో కూడిన తెలంగాణ కాదని, ఆకాంక్షలతో కూడిన తెలంగాణ కావాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. బిల్లు తయారీ నేపథ్యంలో తెలంగాణ ప్రజల అధికారాలకు కత్తెర వేస్తూ, వనరుల పంపకంలో వివక్ష చూపిస్తూ కేంద్రం నిర్ణయాలు తీసుకోనున్నదనే సమాచారం మేరకు తాము ఢిల్లీ పర్యటన చేపట్టామని తెలిపారు. ఈ మేరకు జీవోఎంకు హాజరైన టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ తదితర పార్టీల ముఖ్య నేతలను కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమావేశంలో మాట్లాడాలని కోరామన్నారు. జీవోఎం సమావేశంలో రాష్ట్ర పార్టీలు పాల్గొంటున్న సందర్భంగా తాము చేపట్టిన ఢిల్లీ పర్యటన విజయవంతమైందని టీ జేఏసీ బృందం ప్రకటించింది.

బుధవారం ఢిల్లీ విలేకరులతో టీ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ కొద్దిరోజులుగా మీడియాలో వస్తున్న కథనాలు తమను బాధకు గురిచేశాయన్నారు. ఆరు దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అర్థం లేకుండా చేస్తూ కేంద్రం రాష్ట్ర విభజన బల్లును రూపొందించేందుకు కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. అధికారికంగా కేంద్రం ప్రకటన చేయకున్నా మీడియా కథనాలతో అప్రమత్తమయ్యామన్నారు. విభజనపై తాము ఇంతవరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, తాము ప్రకటించినట్లు వస్తున్నవి అవాస్తవాలుగా, మీడియా పుకార్లుగా జీవోఎం సభ్యులు ప్రకటించడంతో కాస్త ఊరట కలిగిందన్నారు. ఏదిఏమైనా త్వరలో రూపుదిద్దుకోబోతున్న బిల్లు తెలంగాణ ప్రజల ఆంకాంక్షలకు అద్దం పట్టేవిధంగా ఉండాలని కేంద్రాన్ని డిమాండు చేశారు. మంత్రుల బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు అందాయని జరుగుతున్న ప్రచారంపై కోదండరాం స్పందించారు. ‘వార్తలను బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పంపించిందన్న నివేదికలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిని టీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత ఆ నివేదికలపై ఆరా తీస్తాం. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులను సెక్ర కలిసి వివరణ తీసుకుంటాం’ అని తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపాలనుకున్నప్పుడు తెలంగాణ డిమాండ్లను కూడా అందులో చేర్చాలని కోరుతామని చెప్పారు. జీవోఎం సమావేశాలకు గైర్హాజరైన చంద్రబాబు తెలంగాణ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. 13 జిల్లాల సీమాంధ్రకు పరిమితమై వైఎస్సార్సీపీ చేస్తున్న వాదనలను పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తెలంగాణ ప్రజలకు స్వయం పాలన అధికారం లేకుండా చేస్తున్న సీమాంధ్ర పాలకుల కుట్రలను ఖండిస్తున్నామని టీ జేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు.

తెలంగాణ అధికారాలు, వనరులపై పూర్తి హక్కులను కలిగిఉండేలా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. లేకుంటే మరో యుద్ధం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా బిల్లును రూపొందిస్తే మరో యుద్ధానికి ఉద్యోగులు సిద్దమని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవివూపసాద్ స్పష్టం చేశారు. జీవో 610, 36తోపాటు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా విభజన తరువాత వెనక్కి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పాటు కాగానే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును వెంటనే అమల్లోకి తేవాలని అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌డ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.