అసెంబ్లీ సీను.. ఆంధ్రా ప్రభుత్వానిది అదే పక్షపాతం

-సెల్యూట్ కొట్టడం ఒక్కటే తక్కువ!
-పోలీసుల సీమాంధ్ర ప్రేమ
-సీమాంధ్ర నేతల దీక్షకు ఎర్రతివాచీ
-దగ్గరుండి అన్ని ఏర్పాట్లు
-టీఆర్‌ఎస్ దీక్షల సమయంలో గేటుదాటనివ్వలేదు
అదే కుట్రపూరిత వైఖరి.. వచ్చిన తెలంగాణను అడ్డుకునే కుట్రలకు ఎర్ర తీవాచీ ఆహ్వానాలు.. దండలు వేయడం, సెల్యూట్ కొట్టడం ఒక్కటే తక్కువ.. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీమాంధ్ర ప్రాంత మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల దీక్షపై పోలీసుల వైఖరి ఇది.
bavanగతంలో తెలంగాణ ప్రజల గొంతు వినిపించటానికి శాసనసభ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించిన ప్రతీసారి అధికార దండాన్ని ప్రయోగించిన సీమాంధ్ర సర్కార్ దర్శకత్వంలో పోలీసు యం త్రాంగం మంగళవారం దీక్ష చేసిన సీమాంధ్ర ప్రాంత నేతలకు మాత్రం ఎర్రతివాచీ పరిచింది. మూడు గంటలపాటు దీక్ష జరుపుకోవటానికి పూర్తి సహకారాన్ని అందించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదమూడేళ్లుగా మలి దశ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణవాదులు అనేక రూపాల్లో పోరాటాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే జనవరి 27న రాజకీయ జేఏసీ ఇందిరాపార్కు వద్ద ముప్పయి ఆరుగంటల సమరదీక్షకు పిలుపునిచ్చింది. అయితే, దీనికి పోలీసులు అనుమతి ఇవ్వటానికి నిరాకరించారు. దీనిని తీవ్రంగా నిరసించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీగా అసెంబ్లీ నుంచి ఇందిరాపార్కుకు వెళ్లాలని బయల్ధేరారు.

దాంతో పోలీసులు వారిని అసెంబ్లీ గేటు వద్దనే అడ్డుకున్నారు. సమరదీక్షకు అనుమతి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లనిచ్చేది లేదన్నారు. దాంతో సమరదీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వనిపక్షంలో ఎక్కడివారు అక్కడే బైఠాయించి దీక్ష చేపట్టాలన్న జేఏసీ పిలుపు మేరకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే, పోలీసులు, అసెంబ్లీ మార్షల్స్ వారిని అక్కడికి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా గాంధీ విగ్రహం ఆవరణలోకి వెళ్లకుండా అసెంబ్లీ సిబ్బంది గేట్లు కూడా వేసేశారు. దాంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, రాజయ్య, వినయ్‌భాస్కర్‌లు గేటు పైనుంచి దూసి గాంధీ విగ్రహం ఉన్న ఆవరణలోకి వెళ్లాల్సి వచ్చింది. మధ్యాహ్నం 1.30గంటల సమయం తరువాత సమరదీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వటంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దీక్షను విరమించుకుని అసెంబ్లీ నుంచి ఇందిరాపార్కు చేరుకుని రాజకీయ జేఏసీ నిర్వహించిన సమరదీక్షలో పాల్గొన్నారు.

మంగళవారం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పదిహేడు మంది మంత్రులు, నలభై మంది ఎమ్మెల్యేలు, పదిమంది ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు దీక్ష జరిపారు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే గతంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తామంటే అడ్డుకుని…గేట్లు వేసి నిర్భంధాన్ని అమలు చేసిన పోలీసులు, అసెంబ్లీ సిబ్బంది సీమాంధ్ర ప్రాంత నాయకుల దీక్షకు మాత్రం పూర్తిగా సహకరించారు. దీక్షకు ఎలాంటి ఆటంకం రాకుండా దగ్గరుండి చూసుకున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడితే స్పీకర్ అనుమతి లేనిదే తాము అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి చర్యలు చేపట్టలేమని దాటవేశారు. మరి గతంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తామన్నపుడు ఎందుకు అడ్డుకున్నారు? అన్న ప్రశ్నకు మాత్రం వాళ్లు సమాధానం చెప్పలేకపోయారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.