అసెంబ్లీలో మార్మోగిన జై తెలంగాణ

-ప్రత్యేక రాష్ట్రం కోసం తీర్మానం చేయాల్సిందే
-పట్టుపట్టిన టీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు

అసెంబ్లీలో ‘జై తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తీర్మానం చేయాలంటూ టీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. రెండుసార్లు సభను వాయిదా వేసినా వారు పట్టు వీడలేదు. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ముందుగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు ప్లకార్డులతో చేరుకున్నారు. నినాదాలతో హోరెత్తించారు. వారితోపాటే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్లకార్డులు పట్టుకొని పోడియాన్ని చుట్టుముట్టారు. ‘జై తెలంగాణ, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టాలి’ అంటూ ఇరు పార్టీల సభ్యులు పెద్ద పెట్టున నినదించారు. తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. అదే సమయంలో టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వచ్చి.. ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’ అంటూ నినాదాలు మొదలుపెట్టారు. దీంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు.

ఆ తర్వాత సభ తిరిగి ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకాగానే.. టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకొని బయ్యారం ఉక్కు కేటాయింపుపై నిరసన తెలిపారు. ఆ వెంటనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ‘జై తెలంగాణ’ నినాదాలతో పోడియం ముందుకు చేరుకున్నారు. సభలో టీడీపీ, టీఆర్‌ఎస్ సభ్యుల నినాదాల మధ్యలోనే స్పీకర్ మూడు బిల్లులకు అనుమతిచ్చారు. పురపాలక సంఘాల చట్టసవరణ బిల్లును మంత్రి మహిధర్‌డ్డి, మెడికల్ ప్రాక్టీషనర్స్‌కు సంబంధించి రెండు బిల్లులను మంత్రి ఆనం రాంనారాయణడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభ వాయిదా పడి.. మధ్యాహ్నం 12.15గంటలకు తిరిగి ప్రారంభమవగానే టీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు మళ్లీ పోడియం వద్దకు చేరుకున్నారు. తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సభ్యులు సహకరించాలని, ఎంతో ముఖ్యమైన సంక్షేమం, పక్కా గృహనిర్మాణం వంటి పద్దులపై చర్చలకు సహకరించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కోరారు.

అయినా.. టీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు పట్టువీడలేదు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు తారకరామారావు, జూపల్లి, రాజయ్య, చెన్నమనేని రమేష్‌తో పాటు బీజేపీ శాసనసభాపక్షనేత యెండెల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసడ్డి ప్లకార్డులు చేతబూని శాసనసభలో తెలంగాణపై తీర్మానం చేయాల్సిందేనంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అధికారపార్టీ సభ్యుడు కిచ్చెనగారి లకా్ష్మడ్డి తన స్థానంలో నిలబడి ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేయడంతో సభ్యులంతా ఆయన వైపు చూశారు. కాంగ్రెస్ సభ్యుడు మస్తాన్‌వలిని మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించడంతో ఆయన విపక్షసభ్యుల నినాదాల మధ్య రెండు నిమిషాలు మాట్లాడారు. అంతలోనే స్పీకర్.. మస్తాన్‌వలిని కూర్చోవాల్సిందిగా సూచించారు. పోడియం వద్ద సభ్యుల నినాదాలు సద్దుమణగకపోవడంతో సభ తిరిగి ప్రారంభమైన 15 నిమిషాలలోపే బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

12 స్టాండింగ్ కమిటీల నివేదికలు
బడ్జెట్ పద్దులపై స్థాయీసంఘాలు రూపొందించిన 12 నివేదికలను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇలా స్థాయీ సంఘాల నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కొత్త సంప్రదాయం. వీటిపై సభలో చర్చ జరగనుంది. కాగా, అసెంబ్లీలో వివిధ రాజకీయ పార్టీలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. బయ్యారం ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని టీడీపీ, పంచాయతీ రిజర్వేషన్లపై వైఎస్సార్సీపీ, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని బీజేపీ, అంగన్‌వాడీ సమస్యలపై సీపీఎం, ప్రత్యేక తెలంగాణ కోరుతూ సీపీఐ, విద్యుత్ చార్జీల పెంపుపై ఎంఐఎం, తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్, నాగం , వేణుగోపాలచారి వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయితే స్పీకర్ వాటిని తిరస్కరించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.