అవినీతి రహిత భారత్‌ కావాలంటే మోడీకే పట్టం కట్టాలి కిరణ్‌ బేడీ

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీకి మరో గట్టి మద్దతుదారు లభించారు. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే బృందంలోని కీలక సభ్యురాలు, భారతదేశ తొలి ఐపీఎస్ అధికారణి కిరణ్ బేడీ  తాను మోడీని ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు.

స్థిర భారత్‌ కోసం, దేశంలో మెరుగైన పాలన కోసం, పారదర్శకత, సమ్మిళిత అభివృద్ధి కోసం తన ఓటు బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకేనని మాజీ కిరణ్‌బేడీ బహిరంగ మద్దతు ప్రకటించారు. దేశం సుస్థిరంగా ఉండాలంటే అనుభవజ్ఞుడితోనే  సాధ్యమంటూ ఆమె వ్యాఖ్యానించారు. అవినీతి రహిత భారత్‌ కావాలంటే మోడీకే పట్టం కట్టాలని కిరణ్‌ బేడీ పిలుపునిచ్చారు.

టైమ్స్‌ నౌ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బేడీ తన అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల కాంగ్రెస్‌ పాలనపై ఆమె నిప్పులు కక్కారు. ఈసారి మోడీకి అవకాశం ఇవ్వాలన్నారు.   ట్వీట్‌ ద్వారా కూడా కిరణ్‌ బేడీ తమ మద్దతును తెలియజేశారు. మోడీకి ఓటెయ్యాల్సిన ఆవశ్యకతను తెలియ చేశారు.
కిరణ్ బేడీ మద్దతుతో అన్నా బృందం మద్దతు మోడీకే అనే సంకేతాలు పంపినట్లు అయ్యింది. అవినీతికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం జరుపుతోన్న అన్నా హజారే బృందం అవినీతి రహిత భారత్‌ కోసం మోడీకి మద్దతివ్వడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆర్మీ మాజీ చీఫ్‌ వికెసింగ్‌ బిజెపిలో చేరనున్నారని వార్తలు వస్తున్న తరుణంలో కిరణ్‌బేడీ…. మోడీకి బహిరంగంగా మద్దతు పలకడం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కిరణ్‌బేడీ మోడీకి మద్దతు పలకడాన్ని బిజెపి స్వాగతించింది. ఐపీఎస్‌ అధికారిగా దేశంలో గొప్పపేరు తెచ్చుకున్న బేడీ…. మోడీకి మద్దతు పలకడం శుభపరిణామమని వ్యాఖ్యానించింది.
ఇన్నాళ్లు కాంగ్రెస్ పై పోరాడి అధికారం కోసం కేజ్రీవాల్ కాంగ్రెస్ తోనే కలవడాన్ని అన్నా టీమ్ తప్పుబడుతుంది.  ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార  కార్యక్రమానికి కిరణ్ బేడీని ఆహ్వానించినా ఆమె హాజరు కాలేదు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.