అరిగోస పోసుకుంటున్నరు

ఇంత అన్యాయమా?…అరిగోస పోసుకుంటున్నరు కద!… ఇవాళ ఏ తెలంగాణవాసిని కదిలించినా చెప్పేమాట ఇది. పట్టణాలు, గ్రామాలు తేడా లేదు. పురుషులు, మహిళలన్న బేధం లేదు. పేద, ధనిక వ్యత్యాసం లేదు. అందరిదీ ఇదే మాట. భాషలో తేడా ఉండొచ్చు. వ్యక్తీ కరణలో తేడా ఉండొచ్చు. గుండెమంటలో మాత్రం ఇసుమంత ఫరక్ లేదు. ఇవాళ అంతా తెలం గాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర రాజకీయ నాయకులు చేస్తున్న సర్కస్ ఫీట్ల గురించి మాట్లా డుతున్నారు. ఎవరూ ఎవరినీ ఎడ్యుకేట్ చేసే పనిలేదు. అందరికీ అన్నీ తెలిసిపోయి నయ్. నాలుకలు ఎన్ని మడతలు పెడుతున్నరో చూస్తున్నరు. నాటకాలు ఎట్లా ఆడుతున్నరో చూస్తున్నరు. ఎవరెంత విషం.. ఎట్ల చిమ్ముతున్నరో చూస్తున్నరు. అరవై ఏండ్ల తర్వాత కేంద్రం గుండె కరిగి తెలంగాణ ఇస్తనంటే ఎన్ని తిప్పలు పెడుతున్నరో చూస్తున్నరు. ఇంతచేసి ఎట్ల కలిసుంటమను కుంటున్నరు, ఏం ముఖం పెట్టుకొని కలిసుంటరు.. అనేది అందరినోట వినిపించే ప్రశ్న.

హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ ప్రజలను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు అన్ని విలువలు వదిలేసి విషం చిమ్ముతున్న తీరును ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. అరవై ఏళ్లు భరించి, భరించి విముక్తి కావాలని కోరుతుంటే తెలంగాణ గొంతును మందబలంతో తొక్కేయాలనుకుంటున్న సీమాంవూధుల తీరుపై మండిపడుతున్నారు. రోజుకో కొత్తకుట్రకు తెరతీస్తున్న వైనం పై నిప్పులు చిమ్ముతున్నారు. ‘మనుషులు ఇంత అన్యాయంగా ఉంటారా’ అని విస్తుపోతున్నారు. పెడితే పెండ్లి అంటరు లేకుంటె సావు అంటరా అని మండిపోతున్నరు. నిన్న మొన్నటిదాకా ఎవరేం మాటలు చెప్పిందీ తలుచుకుని పళ్లునూరుతున్నారు. ఎన్ని ముచ్చట్లు చెప్పారు. ఇవాళ ఏం చేస్తున్నారు అని మండిపడుతున్నారు. నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్న తీరునుచూసి నోరు వెళ్లబెడుతున్నరు.

imageతెలంగాణ ప్రజలు 1956లోనే సమైక్య రాష్ట్రం మాకొద్దన్నప్పుడు వీళ్లను రమ్మన్నదెవరని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని పెద్దలను మేనేజ్ చేసి సీమాంవూధులు తెలంగాణలో చొరబడ్డారని, అన్నదమ్ములం అంటూ ‘తెలంగాణ అభివృద్ధి మా ప్రత్యేక బాధ్యత’ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పారని అంటున్నారు. ఒప్పందాలు పోయినయ్. మా ఉద్యోగాలు పోయినయ్. నీళ్లు పోయినయ్..నిధులన్నీ పోయినయ్. 1969లో మాకు వద్దే వద్దు అని మళ్లీ అన్నాం… వందల మందిని కాల్చిపారేశారని అంటున్నారు. మలిదశ ఉద్యమం కీలెరిగి వాత పెట్టే పద్ధతిలో వచ్చి పునాదులకు ఎసరు వస్తే మాటలు మార్చారని గుడ్లురుముతు న్నరు. ఎన్నో ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుండెచీల్చి అభీష్టాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. దీక్షలతో ప్రాణాలు ఫణంగా పెడితే కేంద్రం కదిలి తెలంగాణ ప్రకటించిందని నరంలేని నాలుకలను ఇష్టం వచ్చినట్టు మార్చారని దుయ్యబడుతున్నారు.

చర్చలు జరపలేదా?
అప్పటినుంచి కేంద్రం ఎన్నోసార్లు చర్చలు జరిపిందని, నాయకులందరినీ పిలిచి మాట్లాడిందని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇవాళ సీమాంవూధులు ఎవరితోనూ చర్చించలేదనడం పచ్చి అబద్ధమని బల్లగుద్ది చెబుతున్నారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన 23నాడు ఆపివేసిన తర్వాత కేంద్రం 2010 జనవరి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభివూపాయాలు అడిగిందన్న విషయం గుర్తు చేస్తున్నారు. ఆనాటి సమావేశానికి అన్ని పార్టీల వారు హాజరు కాలేదా? అభివూపాయాలు చెప్పలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాతే కేంద్రం శ్రీకృష్ణ కమిటీ వేసిందని వారు చెబుతున్నారు. ఆ కమిటీ ఏడాదిపాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తిరిగిందని అందరినీ కలిసి అభివూపాయాలు తీసుకుందని వారంటున్నారు. ఆ కమిటీ నివేదికలో అనేక విషయాలు చెప్పిందని అందులో తెలంగాణ ఏర్పాటు కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. అదీ గడిచిన తర్వాత 2012 డిసెంబర్ నెలలో షిండే మరో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేరని దానికి కూడా పార్టీలన్నీ హాజరై తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని గుర్తుచేస్తున్నరు. దాని పర్యవసానంగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంవూతిని, ఉప ముఖ్యమంవూతిని పిలిచారని, వారు తమ తమ ప్రజెం ఇచ్చారని చెబుతున్నారు.

అక్కడ గంటల తరబడి మాట్లాడిన వాళ్లు ఇవాళ ఎవరితో చర్చించారని ప్రశ్నించడం వింతగా ఉందని అంటున్నారు. ఇంత జరిగిన తర్వాత తెలంగాణకు నిర్ణయం తీసుకున్నా మళ్లీ పార్టీ పరంగా ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసి అభివూపాయాలు వివరంగా తెలసుకున్నారని, అదీ చాలదని కేంద్రమంవూతుల బృందం కూడా చర్చలు జరిపిందని చెబుతున్నారు. ఇంకా ఏం జరపాలి? ఏం చేయాలి? అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అయితే వీరప్ప మొయిలీ దగ్గరినుంచి ఆజాద్, దిగ్విజయ్ ఇన్‌చార్జిలుగా ఉన్న సమయాల్లో ఎన్ని డజన్లసార్లు ఎన్ని సీమాంధ్ర కాంగ్రెస్‌నాయకుల బృందాలు పర్యటనలు జరిపారో గుర్తు చేసుకోవాలని వారంటున్నారు. ఢిల్లీ ఏపీభవన్‌లో బస చేసిన వారి లిస్టులు చూస్తే అసలు విషయాలు బయటపడతాయంటున్నారు. ఢిల్లీ టూర్లు చేసి ప్రణబ్‌నుంచి ఆంటోనీ, ఆజాద్, అహ్మద్ పటేల్ , వీరప్ప మొయిలీలతో ఎన్ని వందల గంటలు రాష్ట్ర విషయం చర్చ జరిపారో గుర్తు చేసుకోవాలని అంటున్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు వీళ్లంతా ఏ బొంతకప్పుకుని పడుకున్నరని అడుగుతున్నారు. కరీంనగర్‌లో 2004లో భువనగిరిలో 2009లో సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామన చెప్పినప్పుడు ఏంచేశారని అడుగుతున్నారు.

ఇంతా చేసి ఎలా కలిసుంటారు?
తెలంగాణ మీద రాజకీయవాదుల కుట్రలన్నీ గమనిస్తున్నామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. వాళ్లు మాట మార్చడం చూశాం. తెలంగాణ ఇస్తానన్నందుకు సొంతపార్టీని కూల్చే యత్నాలు చూస్తున్నాం. ఇక వాడి తల్లో పుట్టినోడన్నట్టు వీళ్లకంటే ఎక్కువ ఎగిగిరి పడ్డ సీమాంధ్ర ఉద్యోగుల తీరును చూస్తున్నాం! ఆత్మహత్యలుండవు…హత్యలే అనే దురహంకార వాదనలు చూశాం. తెలంగాణ నడిబొడ్డున నిలబడి మీ బతుకు అంటున్న మహా తల్లులను చూస్తున్నాం. హైదరాబాద్ మా రక్తం..మా చీము.. మా పిండాకూడు అంటున్న మేధావులను చూస్తున్నాం. పాఠశాలల్లో నోటుబుక్కుల్లో తెలంగాణ అని రాసుకున్నందుకు చితకబాదిన స్కూలు యాజమాన్యాలను చూస్తున్నాం.. జబ్బలు చరుస్తున్న లాయర్లను హైకోర్టులో చూస్తున్నాం.. ఇంటి పక్కోడి వంకరమాటలు చూస్తున్నాం. ఇడ్లీ బండోడి బూతు మాటలు విం టున్నాం. అసెంబ్లీని ముట్టడిస్తామంటాడో సీమాంధ్ర ఉద్యోగనాయకుడు. దిగ్విజయ్ రావొద్దంటాడొకడు. ఆత్మాహుతి దళాలమవుతామంటాడొకడు.. గంటకో పిటిషన్ కోర్టులో పెడతాడో మరొకడు!

ఇవేం టీవీలు..ఇవేం కతలు!
ముఖ్యంగా మీడియా తీరుపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వెయ్యిమంది పిల్లలు చచ్చిపోయినా ఎలాంటి జంకుగొంకూ లేకుండా వాళ్లు ప్రసారం చేస్తున్న కథనాలే పిల్లల ప్రాణాలు తీస్తున్నాయంటున్నారు. గంటకో కథ, నిమిషానికో వివాదం, రోజుకో నాటకం ఆడుతున్నాయంటున్నారు. తెలంగాణ నాయకులు మాట్లాడే ప్రతిమాటను వక్రీకరిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న చెప్పిన మాట ఇవాళ ఉండదు ఇపుడు చెప్పిన మాట గంట తర్వాత ఉండదని గుర్తుచేస్తున్నారు. షిండే విదర్భవాడని, తెలంగాణ ఇవ్వడని ఓ టీవీలో ప్రసారం చేశారు. ఇంతకీ ఆయన మరాట్వాడావాడు.

ఆయనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇపుడా టీవీ ముఖం ఎక్కడ పెట్టుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. శ్రీకృష్ణకమిటీ నివేదిక ఇచ్చేముం దు రోజుకో ముచ్చట. హైదరాబాద్ యూటీ అని ఓసారి సీమాంవూధకే అని ఓసారి తెలంగాణకు వేరే రాజధాని అని ఇంకోసారి ఇలా నోటికొచ్చిన ప్రచారాలు చేశాయి. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త పార్టీ పెడుతున్నారని కొన్ని రోజులు ఊదరగొట్టారు. ఇక ఉద్యమపార్టీ మీద నిందలు వేయడానికి, వెంటాడి వేధించడానికి వాళ్లకు రోజుకు 24 గంటలు కూడా సరిపోలేదు. వార్డు స్థాయికూడా లేని ఏబ్రాసి నాయకుడెవరో పార్టీ వీడితే తాళం వేసుకుంటారనే లెవల్లో ప్రచారాలు. ఎవడన్నా ఓ మాట వ్యతిరేకంగా మాట్లాడితే వాడితో గంటలకొద్దీ ఇంటర్వ్యూలు..అదే తెలుగుదేశం కీలకనేత బయటికి పోతే రాజకీయభిక్ష పెట్టిన పార్టీకి వెన్నుపోటా అనే వాదనలు!! పదవుల కోసం.. పైసల కోసం అనే బురదలు ప్రసారం చేసేవని గుర్తు చేస్తున్నారు. ఇక కేంద్రం తెలంగాణ ఇస్తే వీళ్ల ఆస్తులనో ఆలుబిడ్డలనో లాగేసుకున్నట్టు లబలబలాడడమేమిటని నిలదీస్తున్నారు. ట్యాంకుబండ్ మీద విగ్రహాలు కూలితే ఉన్మాదం అనడానికి తెగించిన టీవీలు… సీమాంవూధలో జాతినేతల విగ్రహాలు ఉరితాళ్లు పెట్టి మరీ లాగేస్తే కూల్చేస్తే ఎందుకు పట్టించుకోలేదని ఇవాళ తెలంగాణలో పెద్దగా చదువులేని అతిసామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు..ఏం చెబుతారు??

కూడని పొత్తుల్లేవ్..రాని ప్రకటనల్లేవ్
-9-12-2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన.
-23-12-09: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో, సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతామని ప్రకటన.
-30-12-09: అఖిలపక్షానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలకు కేంద్ర హోంశాఖ పిలుపు.
-5-1-2010: ఢిల్లీలో జరిగిన మొదటి అఖిలపక్ష సమావేశం.
-28-1-10: రాష్ట్ర పరిస్థితుల అధ్యయనానికి కమిటీని నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటన.
-3-2-10: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై జస్టిస్ శ్రీకృష్ణ సారథ్యంలో సంప్రదింపుల కమిటీ ఏర్పాటు.
– 4-3-10: రాష్ట్రానికి శ్రీకృష్ణ కమిటీ రాక. అన్ని పార్టీల అధినేతలతో సమావేశం.
-6-1-2011: శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడి.
-5-12-2012: డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటన.
-28-12-12: కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన 8 పార్టీలతో అఖిలపక్ష భేటీ. తెలంగాణ సమస్యను నెలలోగా పరిష్కరిస్తామని షిండే ప్రకటన.
-1-7-2013: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలో నిర్ణయం వెల్లడిస్తుందని దిగ్విజయ్‌సింగ్ ప్రకటన.
-9-7-13: ఢిల్లీలో జూలై 12న పార్టీ కోర్ కమిటీ సమావేశానికి రావాల్సిందిగా సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షునికి అధిష్ఠానం పిలుపు.
-12-7-13: కోర్ కమిటీ సమావేశం అనంతరం తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. దీనిపై సీడబ్ల్యూసీ మీటింగ్‌లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయసింగ్ ప్రకటన.
-26-7-13: కోర్ కమిటీ సమావేశం అనంతరం తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూద్దామని దిగ్విజయ్‌సింగ్ ప్రకటన.
-28-7-13: జూలై 30వ తేదిన యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం,సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం.
-30-7-13: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్ల్యూసీ తీర్మానం. పార్టీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని దిగ్విజయ్‌సింగ్, అజయ్‌మాకెన్ ప్రకటన.
-6-8-13: నలుగురు సభ్యులతో కూడిన ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన.
-7-8-13: ఆంటోనీ కమిటీ ఏర్పాటు.
-3-10-13: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అంగీకారం.
-11-10-13: తెలంగాణపై కేంద్రం ఏర్పాటు చేసిన జీవోఎం మొదటి సమావేశం.
-31-10-13: అఖిలపక్షానికి హాజరు కావాల్సిందిగా ఎనిమిది పార్టీలకు కేంద్ర హోంశాఖ లేఖలు.
-12, 13-11-13: రాజకీయ పార్టీలతో ముగిసిన అఖిలపక్ష సమావేశాలు. l 5-12-13: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ఆమోదించిన కేంద్ర కేబినెట్.

“ఇప్పుడు ఒకటే ప్రశ్న! ఇన్ని కుట్రలు చేసి..ఇంత విషం చిమ్మి..ఇన్ని మాటలు వదిలేసుకుని.. ఇక్కడి ప్రజల మనసు విరిచేసి ఇంకా….ఎలా కలిసి ఉంటారు. ఏం ముఖం పెట్టుకుని ఉంటారు. అన్నీ మరిచిపోయి మీతో కలిసి ఉండేదెలా? నాలుగున్నర కోట్ల గుండెల లోతుల్లోంచి పెల్లుబుకుతున్న ప్రశ్న! మీ దగ్గర జవాబుందా?”

This entry was posted in ARTICLES.

Comments are closed.