అమానుష ఘటన జరిగి నేటికి 66ఏళ్లు

 

భారతదేశ స్వాతంత్రోద్యమకాలంలో 1919 ఏప్రిల్‌ 13న పంజాబ్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో కిరాతకుడు జనరల్‌ డయ్యర్‌ ఆదేశానుసారం ఉద్యమకారులపై జరిపిన కాల్పుల ఉదంతాన్ని తలపింపజేస్తుంది పరకాలలో 1947 సెప్టెంబర్‌ రెండున జరిగిన ఘటన. నాడు పరకాలలో జరిగిన అమానుష ఘటన చరిత్ర పుటల్లో మరో జలియన్‌వాలాబాగ్‌గా మారింది. నాటి పోరాట స్మృతులు నేటి తరానికి కళ్లకు కట్టినట్లుగా అమరదామం రూపంలో పట్టణంలో వెలసింది. పరకాల ప్రాంత విశిష్ట చరిత్రను గుర్తించిన నాటి కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు తన తల్లి చెన్నమనేని చంద్రమ్మ ట్రస్టు పేరిట అమరవీరుల స్మారక చిహాన్ని నిర్మించారు. రజాకర్లు సాగించిన నాటి బీభత్సకాండ, నిరంకుశ రాచరిక పాలనకు వ్యతిరేకంగా తిరగబడిన యోధుల పోరాట ప్రతిమలను కళ్లకు కట్టినట్లుగా చేయించి నెలకొల్పారు. స్మారక చిహ్నం, యోధుల విగ్రహాలను రూపొందించారు. దేశ్‌ముఖ్‌ల కుట్రలతో చిందిన బందగీ రక్తంలో ఆనాడు రక్తసిక్తమైన దృశ్యాలు అమరదామంలో వెలసిన గ్లోబుపై సజీవ రూపాలా అన్నట్లుగా కనిపిస్తున్నాయి. నిజాం నిరంకుశ పాలనను అంతమొందించి భారత యూనియన్‌లో హైదరాబాద్‌ సంస్థానంలో విలీనం చేసేందుకు తెలంగాణా ప్రాంత ప్రజలు అసమాన ధైర్య సాహసాలతో జరిపిన పోరాటం ఆనాడు దేశ ప్రజలనే కదిలించినట్లు ఊహాచిత్రాలు నేటి యువతరానికి ఉద్యమస్ఫూర్తిని కలుగజేస్తున్నాయి. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిటిజన్‌ క్లబ్‌కు చెందిన స్థలంలో నిర్మించిన అమరువీరుల చిహ్నం, నాటి పోరాట స్మృతులు కళ్లకు కట్టినట్లుగా ఉంటాయి. సుమారు 25లక్షల వ్యయంతో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాలు నాటి యోధుల పోరాట పటిమను సాక్షాత్కరింపజేస్తుంది. నిజాం సైనికులు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపిన ఉదంతాన్ని 25 మీటర్ల ఎత్తులో నిర్మించిన గ్లోబుపై జీవం ఉట్టిపడేలా చిత్రీకరించారు. అంతేగాక స్మారక చిహ్నం చుట్టూ భారత్‌మాతాకీ జై..వందేమాతరం…అంటూ నినదిస్తూ ఉద్యమకారులు పదండి ముందుకు…పదండి తోసుకు…వెళ్తున్నట్లు 135 మహిళా, పురుష విగ్రహాలు అబ్బురపరుస్తున్నాయి. కళ్లు చెదిరే కట్టడాలు పరకాల పట్టణానికి వన్నె తెచ్చాయనడంలో సందేహం లేదు. ప్రత్యేకంగా నిర్మించిన గ్లోబుపై చెట్టు తొర్రలో నుంచి ఒక చెయ్యి బయటకు వచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నట్లు ఉన్న చిత్రం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రజాకర్ల రాక్షస చర్యలకు రంగాపురం గ్రామంలో బలైన ముగ్గురు పోరాట యోధుల విగ్రహాలను చెట్టుకు కట్టేసినట్లు రూపొందించిన దృశ్యాలు చూపరులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన శిల్పకారులు అపురూపంగా తీర్చిదిద్దారు. తెలంగాణా విమోచన కోసం పోరాట యోధులు రక్తార్పణ చేసినట్లు బరిసెలతో నరికిన సంఘటనలో శరీర భాగాలు చిందరవందరగా పడిఉన్నట్లు రూపొందించిన ప్రతిరూపాల్లో సజీవం కనబడుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. డూమ్‌లోపలకు వెళ్లిన సందర్శకులకు మేఘాలు, ఎగిరే పావురాలు త్యాగమూర్తుల పోరాట పటిమ ఫలితంగానే స్వేచ్ఛా స్వాతంత్య్రం కలిగిందనే భావన కలుగుతుంది. గ్లోబుపై హింసాత్మక సంఘటన దృశ్యాలు, లోపల శాంతివచన దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్మారక చిహ్నం ఎదురుగా నీడనిచ్చే చెట్టు, పూలతోటలను కూడా ఏర్పాటు చేశారు. నాటి నిజాం పాలన నుంచి తెలంగాణా ప్రాంతానికి విముక్తి ప్రసాదించడానికి హింసే ఆయుధంగా చేసిన పోరాట స్మృతులను అపురూప కట్టడాల రూపంలో అద్భుతంగా చిత్రీకరించి ప్రదర్శనకు పెట్టడం పలువురిని ఆకట్టుకుంటుంది. మనుషులా లేక రాతి బొమ్మలా అనే రీతిలో చిత్రీకరించిన విగ్రహాలు అత్యద్భుతంగా దర్శనమిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాట చరిత్రలోనే అపురూప కట్టడాలు మహౌజ్జ్వల ఘట్టంగా నిలుస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాటం, బలిదానాల ఘటనలను కళ్లకు కట్టినట్లు వెలసిన అమరవీరుల స్మారక చిహ్నం(అమరదామం) నాటి పోరాట పటమకు అద్దం పడుతుంది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.