అబ్‌కీ బార్‌ మోడీ సర్కార్.. భారత్‌లో కాషాయ ప్రభంజనం

సార్వత్రిక ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ ఆధిక్యం సాధించడంపై ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ట్విట్టర్‌లో తన స్పందనను తెలియజేశారు. భారత్ గెలిచింది. ముందున్నవన్నీ మంచిరోజులే (భారత్ కీ విజయ్. అచ్చే దిన్ ఆనేవాలే హై) అని ట్వీట్ చేశారు. 

తల్లి ఆశీర్వాదం తీసుకున్న మోడీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తొలిరౌండ్ నుంచి బీజేపీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుండటంతో.. ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ముందుగా తన తల్లి ఆశీర్వాదం తీసుకునేందుకు గాంధీనగర్ వెళ్లారు. తన సోదరుడు పంకజ్‌మోడీ నివాసానికి వెళ్లి తల్లి హీరాబెన్‌కు పాదాభివందనం చేశారు. రెండు చేతులు కొడుకు తలపై ఉంచి నిండు మనసుతో ఆశీర్వదించారు. సోదరుడి పిల్లలతో మోడీ కాసేపు సరదాగా గడిపారు. వడోదర లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసే సమయంలోనూ మోడీ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

modiiకాగా, తన కొడుకు ప్రధానమంత్రి కావాలని కోరుతూ హీరాబెన్ ఉదయమే భగవంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీకి తల్లి స్వీట్లు తినిపించారు. అనంతరం ఎన్నికల ఫలితాల సరళిపై మీడియా హీరాబెన్ స్పందన కోరగా.. మోడీకి నా ఆశీస్సులు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నాయకత్వం వహిస్తాడు అని పేర్కొన్నారు. మోడీ మరో సోదరుడు ప్రహ్లాద్ మోడీ గురువారం మీడియాతో మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నరేంద్రమోడీ దేశానికి ప్రధాని అవుతాడని తమ కుటుంబం ఎప్పటినుంచో గట్టి నమ్మకంతో ఉంది అని చెప్పారు. అతి పిన్న వయసులోనే ఆరెస్సెస్ కార్యకలాపాలపై ఆకర్షితుడై, కుటుంబాన్ని వదిలివెళ్లిన మోడీని ఇప్పుడు తాము మావాడే అని చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు దేశమంతా అతడిని తమ కుటుంబసభ్యుడిగా ఆదరిస్తున్నదని చెప్పారు.

చాయ్‌వాలా టు ప్రధాని..
– ఉత్థానపథాలతో సాగిన మోడీ జీవితం
అహ్మదాబాద్, మే 16: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో తప్పితే.. ఇంత భారీస్థాయి ఓటమిని ఎప్పుడూ ఆ పార్టీ ఎరుగదు. అదే సమయంలో బీజేపీ పుట్టినప్పటినుంచి ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లు ఎప్పుడూ లభించలేదు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2001లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే బీజేపీకి 183 స్థానాలు లభించాయి.

తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆ చరిత్రను తిరగరాశాయి. కౌంటింగ్‌లో తొలి రౌండ్‌నుంచి బీజేపీ స్పష్టమైన మెజారిటీ కనబర్చి.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసేస్థాయికి ఎదిగింది. కాంగ్రెస్ కంచుకోటలు బద్దలు కొడుతూ.. బీజేపీని విజయపథాన నడిపించి.. ఘనత మొత్తంగా నరేంద్రమోడీదే. కమలయోధుడుగా ఆయన పార్టీ తరఫున ఒంటరి యుద్ధం చేశారు. పార్టీలో వ్యతిరేకులనుంచి వస్తున్న ఒత్తిళ్లను అధిగమిస్తూనే.. కాంగ్రెస్ వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. 60 ఏళ్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు.. 60 నెలలు బీజేపీకి ఇచ్చి చూడండని ఓటర్లను ఆలోచింపజేసిన నరేంద్రమోడీ.. పెద్ద రాజకీయనేపథ్యం ఉన్న కుటుంబంనుంచి రాలేదు. చిన్నప్పుడు రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్మిన బాలుడు.. ఆరెస్సెస్ భావజాలానికి ఆకర్షితుడై ఇంటిని వదిలి.. రాజకీయాల దిశగా అడుగులు వేసి.. దేశంలోనే కీలక స్థానమైన ప్రధానిపీఠాన్ని చేజిక్కించుకున్నారు.

ఓ చాయ్‌వాలాగా ప్రధాని అవుతానని ఎన్నడూ కలగనలేదు. కానీ, మోడీ రాజకీయ చాణక్యం అందుకు అనుకూల పరిస్థితులను సృష్టించాయి. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ పునాదులను పెకిలించి.. కమలాన్ని వికసింపజేశారు. గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరొకరు అయితే, ఆ పరిస్థితులనుంచి బయటపడేవారే కాదు.. కానీ, మోడీ ప్రజలను అభివృద్ధి దిశగా పయనింపజేశారు. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన మోడీ నరేంద్ర వ్యక్తిగత జీవితం ఒకసారి పరిశీలిస్తే.. ఆయన 1950 సెప్టెంబర్ 17న వద్‌నగర్‌లో జన్మించారు. తల్లిదండ్రులు దామోదర్‌దాస్ ముల్‌చంద్ మోడీ, హీరాబెన్, వీరికి ఐదుగురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.

కడు పేదరికంలో పెరిగిన మోడీ చిన్నతనంలో సమీపంలోని రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్మారు. చిన్నతనంలోనే ఆయనకు జశోదాబెన్‌తో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఆ తర్వాత కొంతకాలానికే మోడీ ఇల్లు వదిలి ఆరెస్సెస్ ప్రచారక్‌గా వెళ్లిపోయారు. అక్కడినుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీ సీనియర్ నేతలైన ఎల్‌కే అద్వానీ, కేశుభాయ్‌పటేల్ దృష్టిలో పడటంతో మోడీ రాజకీయప్రస్థానంలో కీలకమలుపు తిరిగింది. ముఖ్యమంత్రిగా తనను తాను నిరూపించుకున్న నరేంద్రమోడీ.. గుజరాత్ అభివద్ధి నమూనాను ప్రచారం చేస్తూ.. ప్రధాని పదవికి తానే సరైన వారసుడినని ఓటర్లకు విశ్వాసం కల్పించారు.

ఇంతింతై వటుడింతై..

-చాయ్‌వాలా టు పీఎం.. ఆరెస్సెస్‌లో చేరికతో మలుపు తిరిగిన మోడీ జీవితం
అహ్మదాబాద్, మే 16: శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కంచుకోటను తునాతునకలు చేస్తూ.. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఢిల్లీ పీఠంపై కమలాన్ని వికసింపజేశారు. దేశంలో బీజేపీ హవా లేదన్న వారందరికీ.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో మోడీ ప్రభావమేమిటో అర్థమయ్యేలా చేశారు. 1984లో కాంగ్రెస్‌కు 404 స్థానాలు దక్కగా ఆ తర్వాత సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే స్పష్టమైన మెజారిటీ ఓ పార్టీకి లభించడం ఇదే మొదటిసారి. కమలయోధుడిగా ఒంటరిపోరాటం చేస్తూ.. బీజేపీని విజయపథాన నడిపించారు. పార్టీలోని సీనియర్లు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా.. స్వపక్షంలో ఒత్తిళ్లను అధిగమిస్తూనే విపక్షాలపై మెరుపుదాడులకు దిగారు. దేశంలోనే బలమైన కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టిన నరేంద్రమోడీ కోట్లాది ఆస్తులు, పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టలేదు. అత్యంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొనే పేద కుటుంబంలో జన్మించారు. పొట్టకూటి కోసం చిన్నాచితక పనులు చేశారు. ఊహ తెలియని వయస్సులోనే రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్మారు.

పేదరికం కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ, ఆరెస్సెస్‌తో పరిచయం ఆయన జీవితాన్నే మార్చివేసింది. ఆయన జీవితంలోని ఉత్థానపథాలను ఓసారి పరిశీలిస్తే.. మోడీ పూర్తిపేరు.. నరేంద్ర దామోదర్‌దాస్ ముల్‌చంద్ మోడీ. ఆయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని 2500ఏళ్ల చరిత్ర ఉన్న వద్‌నగర్ పట్టణంలో జన్మించారు. తల్లిదండ్రులు దామోదర్‌దాస్ ముల్‌చంద్ మోడీ, హీరాబెన్. వీరికి ఐదుగురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. వీరు పట్టణంలోని ఓ మురికివాడలో నివాసముండేవారు. పేదరికం కారణంగా మోడీ చిన్నతనంలోనే సమీపంలోని రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్మారు. నిరక్షరాస్యత కారణంగా తల్లిదండ్రులు ఆయనకు తెలిసీతెలియని వయస్సులోనే జశోదాబెన్‌తో వివాహం జరిపించారు.

చిన్నప్పుడే జీవితంపై స్పష్టమైన అభిప్రాయం ఉన్న మోడీకి ఆరెస్సెస్‌తో పరిచయం.. ఆయన జీవితాన్నే మార్చివేసింది. హిందుత్వ భావజాలానికి ఆకర్షితుడై సంఘ్ ప్రచారక్‌గా పూర్తికాలం పనిచేసేందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆరెస్సెస్‌లో అనేక పదవులు పొంది.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1995, 1998లో ప్రచార బాధ్యతలు చేపట్టి.. గుజరాత్‌లో పార్టీ విజయానికి కారణమయ్యారు. ఆ తర్వాత 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. ఆ తర్వాత కొద్దికాలానికే గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లతో మోడీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా, పారదర్శక పాలనతో ప్రజలను మెప్పించారు.

ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్‌లు చేస్తూ.. యువ ఓటర్లను విపరీతంగా ఆకర్షించారు. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక విధంగా తన సందేశం అందేలా మోడీ ప్రచార సభలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా తనను తాను నిరూపించుకున్న నరేంద్రమోడీ.. గుజరాత్ అభివృద్ధి నమూనాను ప్రచారం చేస్తూ.. ప్రధాని పదవికి తానే సరైన వారసుడినని ఓటర్లకు విశ్వాసం కల్పించారు. ఇక మోడీ చిన్నతనంలో స్థానికంగా ఉన్న 15వ శతాబ్దం నాటి శివాలయానికి తరుచూ వెళ్తుండేవారు. భారతీయులు జన్మభూమిగా భావించే వద్‌నగర్ తన జన్మభూమి అని మోడీ తరుచూ ప్రస్తావిస్తుంటారు.

వడోదరలో మోడీ ఆల్ టైం రికార్డు

– వారణాసిలో 1.5లక్షల మెజారిటీ
దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు, ప్రచారసభలతో రికార్డు సృష్టించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పోటీ చేసిన నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీ సాధించారు. 5,70,128 ఆధిక్యం సాధించి.. వడోదరలో ఆల్ టైం రికార్డు దక్కించుకున్నారు. వారణాసిలో 1.5లక్షల మెజారిటీ దాటారు. దీంతో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ మోడీ విజయం సాధించారు. కాగా, వడోదరలో కాంగ్రెస్ పక్షాన బరిలో నిలిచిన మధుసూదన్ మిస్త్రీపై, వారణాసిలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై మోడీ ఘన విజయం సాధించారు. వడదరలో భారీ ఆధిక్యం సాధించినప్పటికీ.. దేశవ్యాప్తంగా అత్యధిక మెజారిటీగా నమోదైన రికార్డును మాత్రం నరేంద్రమోడీ బ్రేక్ చేయలేకపోయారు. 2004లో పశ్చిమబెంగాల్‌లో సీపీఎం పక్షాల బరిలో దిగిన అనిల్ బసు 5,92,502 ఆధిక్యంతో దేశంలోనే ఆల్‌టైం రికార్డును సృష్టించారు.

గాంధీనగర్‌లో అద్వానీ హవా

గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కీర్తి పటేల్‌పై దాదాపు రెండు లక్షలకు పైచిలుకు ఓట్లతో ఆయన విజయం సాధించారు. గాంధీనగర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అద్వానీకి ఈసారి 3,58,389 ఓట్లు రాగా, కీర్తి పటేల్‌కు 1,16,337 ఓట్లు మాత్రమే వచ్చాయి. మోడీ ప్రభంజనం గుజరాత్‌లో బలంగా ఉండటంతో ఇక్కడ అన్ని సీట్లలో గెలిచి.. బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది.

నీలేకనికి తప్పని పరాజయం

దేశవ్యాప్తంగా అందరి దష్టి ఆకర్షించిన బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో ఇన్ఫోసిస్ సహ స్థాపకుడు, కాంగ్రెస్ అభ్యర్థి నందన్ నీలేకనికి పరాజయం ఎదురైంది. బీజేపీ అగ్రనేత అనంత్‌కుమార్ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. ఆధార్ సంస్థ చైర్మన్‌గా, లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన అత్యంత సంపన్నుడిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన నందన్ నీలేకని బీజేపీ ప్రభంజనం ముందు నిలువలేకపోయారు. పరాజయాన్ని అంగీకరించిన నీలేకని తనపై గెలుపొందిన అనంత్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. బెంగళూరు నగర అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ కోసం ఇకముందు పనిచేస్తానని తెలిపారు.

ఆజాద్‌కు పరాభవం

తొలిసారి జమ్ముకశ్మీర్ నుంచి లోక్‌సభకు పోటీచేసిన కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఉధంపూర్ స్థానంలో ఆయనను బీజేపీ నేత జతింద్రసింగ్ 60,976 ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఇక్కడ ఆజాద్‌కు 4,26,393 ఓట్లు రాగా, జతింద్రసింగ్‌కు 4,87,369 ఓట్లు వచ్చాయి. మూడోస్థానంలో నిలిచిన పీడీపీ అభ్యర్థికి 30,461 ఓట్లు మాత్రమే వచ్చాయి.

అజిత్‌సింగ్ ఓటమి

కేంద్రమంత్రి, ఆరెల్డీ అధినేత అజిత్‌సింగ్ యూపీలోని బాగ్‌పాట్‌లో పరాజయం పాలయ్యారు. ఇక్కడ ఆయనపై పోటీచేసిన బీజేపీ అభ్యర్థి, ముంబై మాజీ పోలీసు కమిషనర్ సత్యపాల్‌సింగ్ విజయం సాధించారు.

కమల్‌నాథ్ భారీ విజయం

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నప్పటికీ ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి కమల్‌నాథ్ మధ్యప్రదేశ్‌లోని తన నియోజకవర్గం చిన్‌ద్వారలో ఘనవిజయం సాధించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి చౌదరి చంద్రభాన్‌సింగ్‌పై కమల్‌నాథ్ 1,16,567 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విదిశలో సుష్మ గెలుపు

మధ్యప్రదేశ్‌లోని విదిశ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. ఆమె ఇక్కడ తన సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నేత లక్ష్మణ్‌సింగ్‌ను ఓడించారు.

గడ్కరీ జయకేతనం

మహారాష్ట్ర నాగ్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితీన్ గడ్కరీ జయకేతనం ఎగురవేశారు. ఇక్కడ ఐదుసార్లు గెలిచిన కాంగ్రెస్ నేత విలాస్ ముత్తెంవార్‌ను గడ్కరీ ఓడించారు.

హర్షవర్ధన్‌కు చాందినీచౌక్

ప్రతిష్ఠాత్మక ఢిల్లీ చాందినీచౌక్ నియోజకవర్గంలో బీజేపీ నేత హర్షవర్ధన్ 1,33,986 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఆప్ అభ్యర్థి అశుతోష్ రెండోస్థానంలో ఉండగా.. కేంద్రమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ మూడోస్థానంలో నిలువడం గమనార్హం.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.