అన్యాయాన్ని సహించలేకే ఎదురు తిరిగినం: కేసీఆర్

సీమాంధ్ర పార్టీల్లో తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాన్ని సహించలేకే ఎదురు తిరిగామని కేసీఆర్ తెలిపారు. ఈ వేదికపై ఉన్న కడియం, తాను టీడీపీ నుంచి వచ్చినవాళ్లమేనని తెలిపారు. అక్కడ అన్యాయం చూసే ఎదురు తిరిగి ఆత్మగౌరవంతో బయటకు వచ్చామని పేర్కొన్నారు. సీమాంధ్రపార్టీల్లో తెలంగాణ నేతలకు న్యాయం జరుగదని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే అత్యంత ధనిక రాష్ట్రమవుతదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. . తెలంగాణలో పుష్కలంగా వనరులున్నాయని, వాటితో దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతది: కేసీఆర్
తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరని ఉద్యమపార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చి తీరుతదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ‘నేను ఆమరణ దీక్ష చేసి తెలంగాణ సాధించాను. వచ్చిన తెలంగాణను సీమాంధ్రపార్టీలు, నేతలు 24 గంటలు తిరుగక ముందే అడ్డుకున్నారు’ అని కేసీఆర్ ఆవేదనతో అన్నారు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్‌లో వైఎస్ జగన్ ప్లకార్డు పట్టుకుని అడ్డుకున్నారని విమర్శించారు. తెల్లవారే కల్లా కృతిమ సమైక్య ఉద్యమాన్ని పుట్టించి సీమాంధ్ర బాబు అడ్డుకున్నాడని దుయ్యబట్టారు.

తెలంగాణ గడ్డపై ఆంధ్రా పార్టీల పెత్తనం అవసరమా?: కేసీఆర్
తెలంగాణ గడ్డపై ఇంకా ఆంధ్రా పార్టీల పెత్తనం అవసరమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రతి గడప ఆంధ్రాపార్టీల అవసరం లేదనే అంటున్నాయని వివరించారు. ఎక్కడ అడిగినా ఆంధ్రా పార్టీల అవసరం లేదనే సమాధానమే వస్తోందని తెలిపారు. ఆంధ్రా పార్టీలు గెలిస్తే తెలంగాణోడు ఎవడైనా సీఎం కాగలడా, కనీసం పార్టీ అధ్యక్షుడైనా కాగలడా అని కేసీఆర్ ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.