అనేకసమస్యలకు పరిష్కారమే టీ ఏర్పాటు:జైపాల్‌రెడ్డి

హైదరాబాద్ : దశాబ్దాలుగా నలుగుతన్న అనేక సమస్యలకు పరిష్కారమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయమని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు.
సీమాంధ్రలో జరుగుతోన్న ఉద్యమాలు, ఆందోళనలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందని జైపాల్‌రెడ్డి అన్నారు. సీమాంధ్రలో అన్ని వర్గాల అనుమానాలకు అక్కడి ఉద్యమం అద్దం పడుతోందని నిక్కచ్చిగా చెప్పగలనని పేర్కొన్నారు. వారు లేవనెత్తిన సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజలు ఇంత ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఐదు కోట్ల ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానాలుంటే కేంద్ర మంత్రుల బృందానికి వివరించొచ్చని తెలిపారు. మంత్రుల బృందం నివేదిక ఇవ్వడానికి ఇంకా ఆరు వారాల సమయం ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్ అంతర్జాతీయ నగరం: జైపాల్‌రెడ్డి
వ్యాపార దృక్కోణంలో చూస్తే హైదరాబాద్ నగరం చెన్నై నగరంలాగా అంతర్జాతీయ నగరం అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఎవరి సొత్తుకాదు, ఆస్తి కాదు అని అన్నారు. ఇక్కడ ఎవరైనా ఉండొచ్చని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాల వల్ల తెలుగు ప్రజల్లో భావ సమైక్యత పెరుగుతుందేగానీ తగ్గదని పేర్కొన్నారు. రాష్ట్రాలుగా విడిపోతున్నామేగానీ, తెలుగు ప్రజలు విడిపోవడంలేదుగా అని అన్నారు. దీంతో తెలుగు భాషమీద సాహిత్యం మీద అభిమానం పెరుగుతుందని వివరించారు.

‘నేను రాజ్యాంగవాదిగా మాట్లాడుతున్నా’
‘నేను కేంద్రమంత్రిగా మాట్లాడటంలేదు. రాజ్యాంగవాదిగా, నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నవాడిగా మాట్లాడుతున్నాను. ఈ విషయం గురించి సీమాంధ్ర మిత్రులతో మాట్లాడతా. అసలు హైదరాబాద్‌లో ఆస్తుల గురించి ఎవరూ భయపడనవసరంలేదు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం దేశంలో ఎవరైనా, ఎక్కడైనా ఆస్తి సంపాదించుకోవచ్చు. కాదనే హక్కు ఎవరికీ లేదు. రైట్ టు ప్రాపర్టీ అన్నది రాజ్యాంగంలో రాసి ఉంది’ అని జైపాల్‌రెడ్డి అన్నారు.

సీమాంధ్రులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు: జైపాల్‌రెడ్డి
సీమాంధ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని జైపాల్ రెడ్డి కోరారు. నదీ జలాల పంపాకాల విషయంలో ఆందోళన వద్దని, నదీ జలాలు పోతాయనేది పచ్చి అబద్దం అని అన్నారు. దానికి సంబంధించి జాతీయ స్థాయిలో నిర్ణయం జరుగుతుందని వివరించారు. విభజన అనంతరం కూడా కొత్త సమస్యలు ఏర్పడితే కొత్త పరిష్కారం ఉంటుందని తెలిపారు. చేవెళ్లలో తాను ఎంపీగా పోటీ చేసినపుడు సీమాంధ్ర ఓటర్లు కూడా తనను ఎంతో ఆప్యాయంగా ఓటేసి గెలిపించారని జైపాల్ గుర్తు చేసుకున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.