అదే అణచివేత

– ఆగని ఏపీఎన్జీవో జులుం
– కొమ్ముకాస్తున్న ప్రభుత్వం
– రణరంగాలవుతున్న కార్యాలయాలు
– చట్టం.. సీమాంధ్ర చుట్టం: మండిపడిన టీఆర్‌ఎస్ నాయకులు

రాష్ట్రంలో అక్షరాలా సీమాంధ్ర పాలన నడుస్తున్నదని తెలంగాణవాదులు మండిపడు తున్నారు. సీమాంధ్రులకో చట్టం.. తెలంగాణకు మరో చట్టం అనే పద్దతి నిస్సిగ్గుగా అమలు అవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రలో విగ్రహాలను, రోడ్లను, ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులకు రాసిచ్చేశారు.. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీవోలు రోజుకో కార్యాలయంలో పర్యటిస్తూ ఉద్రిక్తతలను రేపుతుంటే పట్టించుకోవడం లేదు. సీమాంధ్ర నాయకులు తులసిరెడ్డి, పయ్యావుల, పరకాల హైదరాబాద్‌లో యథేచ్ఛగా సర్కారు కార్యాలయాలు తిరిగి రెచ్చగొడుతుంటే అనుమతిస్తున్నారు.. కానీ దాడికి గురైన ఒక ఉద్యోగిని మానవతావాదంతో పరామర్శించేందుకు విద్యుత్‌సౌధకు వెళ్లిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, కే విద్యాసాగర్‌రావు, జూపల్లి కృష్ణారావులను మాత్రం అడ్డుకుని అరెస్టు చేశారు.

రెచ్చగొట్టే వారికి వీసాలిచ్చేసిన పోలీసులు హైదరాబాద్ కోసం విద్యార్థులు చేపట్టిన శాంతిర్యాలీకి హాజరైన ఈటెల రాజేందర్, స్వామిగౌడ్‌లను మాత్రం అరెస్టు చేసి సీమాంధ్రకు తెలంగాణకు వేర్వేరు చట్టాలున్నాయని బాహాటంగానే ప్రకటించారని టీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. సీమాంధ్రలో విగ్రహాలు కూల్చిన వారిపైన, తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేసిన వారిపైన కూడా ఏ చర్యా తీసుకోని పోలీసులు, ఏ విధ్వంసమూ ఏ ఉద్రిక్తతలు రేపని శాంతియాత్రలపై ఉగ్రవాద చర్యలేవో జరుగుతున్నట్టు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్రలో ఎంపీ వీహెచ్‌పై దాడి సహా అనేక సంఘటనల్లో ఒక్కరినీ అరెస్టు చేయని పోలీసులు, తెలంగాణ ఉద్యోగుల మీద దాడులకు తెగబడుతున్న వారిని సాక్ష్యాలు అందజేసినా కేసు నమోదు చేయటం లేదని, పైగా ఆ బాధితుడి పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం చూస్తే మన రాష్ట్రంలో చట్టం సీమాంధ్ర చుట్టమనే నిర్ధ్దారణ అవుతున్నదని ఆరోపిస్తున్నారు.

aptranscoపరామర్శకు వెళితే అరెస్టు
– దాడి చేసిన వారిని సాక్ష్యమున్నా వదిలేసిన పోలీసులు
– పక్షపాతాన్ని నగ్నంగా ప్రదర్శించిన సర్కారు
– విద్యుత్ సౌధ సాక్షిగా వెల్లడైన చేదునిజం
– చట్టాలు సీమాంధ్రకు చుట్టాలు : ఎమ్మెల్యే హరీష్‌రావు
– దాడిపై పుటేజీ ఆధారాలున్నా చర్యలేవి? : జేఏసీ నేత రఘు

శనివారం నాడు సీమాంధ్రులు విద్యుత్ సౌధ క్యాంటీన్ వద్ద దాడి చేసి కొట్టిన తెలంగాణ ఉద్యోగి సంతోష్‌ను పరామర్శించేందుకు సోమవారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టీ.హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్ సౌధ కార్యాలయంవద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలను పోలీసులు లోనికి అనుమతించలేదు. గేటువద్దే అడ్డుకున్నారు. దాంతో తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహంతో గేటు వద్దకు చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. స్థానిక పోలీసులు, బీఎస్‌ఎఫ్ బలగాలు ఉద్యోగులు ముందుకు రాకుండా అడ్డుగా నిలిచాయి. పరామర్శ నేరమా అంటూ హరీష్‌రావు పోలీసులను నిలదీశారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించారు. పరకాలను పయ్యావులను అనుమతించి మమ్మల్ని ఎందుకు అనుమతించరని అడిగారు. గేటు బయటే ఉన్న మీడియా హరీష్‌రావు-పోలీసు అధికారుల మధ్య జరుగుతున్న వాగ్వివాదాన్ని చిత్రీకరిస్తుండగా పోలీసులు మీడియాను సైతం నిలువరించేందుకు ప్రయత్నించారు.

దాంతో ఎమ్మెల్యే హరీష్‌రావు పోలీసుల చర్యలను తీవ్రంగా ఆక్షేపించారు. తాము బాధితుడిని పరామర్శించేందుకే వచ్చామని, తెలంగాణ ఉద్యోగిపై దాడికి పాల్పడిన సీమాంధ్రులపై చర్యలు తీసుకోకుండా తమను నిలువరించడం ఏమిటని హరీష్‌రావు పోలీసులను నిలదీశారు. దాంతో ఇతరులెవ్వరనీ లోపలికి అనుమతించవద్దని తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో మా ప్రాంతంలోనే మా ఉద్యోగులకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు మాత్రం పోలీసులకు ఆదేశాలివ్వడం శోచనీయమన్నారు. వాగ్వివాదం అనంతరం పోలీసులు ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌లను బలవంతంగా అరెస్టు చేసి పోలీసు వాహనంలో షాహినాత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత కొద్ది సేపటికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌రావు, విద్యాసాగర్‌రావు విద్యుత్‌సౌధ రావడంతో పోలీసులు వారిని సైతం అడ్డుకున్నారు. పోలీసులకు ఎమ్మెల్యేల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు వారిని కూడా అరెస్టుచేసి అక్కడి నుంచి తరలించారు. అంతకు ముందు ప్రజాప్రతినిధులుగా తమను లోపలికి వెళ్ళేందుకు ఎందుకు అనుమతించరని వారు పోలీసులను ప్రశ్నించారు.

ప్రజాప్రతినిధులతో పాటు తెలంగాణ వాదులు విద్యుత్‌సౌధలోకి చొచ్చుకు ప్రయత్నించగా భారీగా తరలివచ్చిన పోలీసులు వారిని నియంత్రించి అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కాగా, విద్యుత్‌సౌధలో ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగుల దాడిని నిరసిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన మహాధర్నా ఆద్యంతమూ తీవ్ర ఉద్రిక్తత మధ్య కొనసాగింది. టీ జేఏసీ పిలుపుమేరకు వందలాది మంది విద్యుత్ ఉద్యోగులు తరలివచ్చి మధ్యాహ్నం విద్యుత్‌సౌధ ప్రధాన గేటు వద్ద నల్లజెండాలతో ధర్నా నిర్వహించారు. విద్యుత్‌సౌధ ప్రాంగణంలో శనివారం(24న)నాడు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి పి.సంతోష్‌కుమార్‌పై దాడిచేసిన సీమాంధ్ర ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

hareeshచట్టాలు సీమాంధ్ర చుట్టాలు : ఎమ్మెల్యే హరీష్‌రావు
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలు సమైక్య ఉద్యమానికి సహకరిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో సామాన్యులను, ప్రజాప్రతినిధులను అరెస్టుచేసి కేసులు నమోదుచేసిన ప్రభుత్వం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 13 జిల్లాల్లో విచ్చల విడిగా చేస్తున్న సమైక్య ఉద్యమకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గర్హనీయమన్నారు. చట్టాలు సీమాంద్రులకు చుట్టాలుగా మారాయని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పక్షపాతంగా వ్యవహరిస్తుందనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదని తెలిపారు. తెలంగాణ వాదులపై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని హరీష్‌రావు ఆరోపించారు. విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర అధికారులు దాడిచేయడాన్ని అయన తీవ్రంగా ఖండించారు.

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తెలంగాణ వాదులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లో రక్షణ కావాల్సింది తెలంగాణ వారికా ? సీమాంద్రులకా అని ఆయన పోలీసులను నిలదీశారు. నెల్లూరులో తెలంగాణకు చెందిన జిల్లాస్థాయి అధికారిపై దాడి చేశారు. నర్సింగ్ కోర్సు శిక్షణ కోసం వెళ్ళి తెలంగాణ యువతిని అడ్డుకుని వెనక్కి పంపించారు, సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు రక్షణగా గన్‌మెన్లను పెట్టుకుని పనిచేయాల్సిన దాపురించిందని తెలిపారు. ఎప్పుడైనా తెలంగాణలో ఒక్క సీమాంధ్ర ఉద్యోగిపై దాడి జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర పక్షపాత ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెబుతామని హరీష్‌రావు హెచ్చరించారు.

పుటేజీ ఆధారాలున్నా చర్యలు తీసుకోరా : విద్యుత్ జేఏసీ రఘు
విద్యుత్‌సౌధలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సంతోష్‌కుమార్‌పై సీమాంధ్ర ఉద్యోగులు దాడికి పాల్పడినట్లుగా స్పష్టమైన వీడియో పుటేజీ ఆధారాలు కనిపిస్తున్నా ఇటు యాజమాన్యం, అటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పక్షపాతానికి ప్రత్యక్ష నిదర్శనమని తెలంగాణ విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కే రఘు విమర్శించారు. శనివారం మధ్యాహ్నం 1.45గంటలకు విద్యుత్‌సౌధ క్యాంటిన్ వైపు సంతోష్‌కుమార్‌పై సీమాంధ్ర విద్యుత్ అధికారులు చెయ్యిజేసుకుని దుర్బాషలాడినట్లుగా సీసీ కెమెరా పుటేజీలో రికార్డు అయ్యిందని ఆయన చెప్పారు. దాడికి కారకులైన సీమాంధ్ర ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ యాజమాన్యాలకు రాతపూర్వకంగా ఫిర్యాదుచేసినా సోమవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి పురోగతి లేకపోవడం విచారకరమన్నారు.

EEtelaశాంతిర్యాలీపై ఉక్కుపాదం
– టీఆర్‌ఎస్‌వీ ర్యాలీ భగ్నం
– ఈటెల, స్వామిగౌడ్, బాల్కసుమన్ అరెస్టు
శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తే ర్యాలీని భగ్నం చేశారు పోలీసులు. ఆ ఆకాంక్షకు మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలనూ వ్యానెక్కించారు.‘‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’’ నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన శాంతిర్యాలీ సందర్భంగా జరిగిన సంఘటనలివి. నిజాం కాలేజీ నుండి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీని నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌వీ ముందే ప్రకటించింది. దీనితో ఉదయం 10 గంటలకే పోలీసులు నిజాం కాలేజీ వద్ద పోలీసులు మోహరించారు. వారికి దీటుగా విద్యార్థులు అంతే స్థాయిలో ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు బాల్క సుమన్ నిజాం కాలేజీలోపల ప్రిన్సిపల్‌తో మాట్లాడుతుండగా వెళ్లిన ఎసీపీ జయపాల్, సీఐ రాఘవేందర్ ర్యాలీ నిర్వహించొద్దని సూచించారు. ర్యాలీ వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందన్నారు.

వారి సూచనలు తిరస్కరించి ర్యాలీ జరుపుతామని విద్యార్థి నేత స్పష్టం చేశారు. దీనితో పోలీసులు అప్రమత్తమై విద్యార్థులను అదుపులోకి తీసుకుని వ్యాన్‌లలో తరలించడం ప్రారంభించారు. అదే సమయంలో ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌లను కూడా అరెస్టు చేశారు. దీనితో బషీర్‌బాగ్ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే నినాదాలతో బషీర్‌బాగ్ దద్దరిల్లింది. ఈ సమయంలోనే నిజాం కాలేజీ గ్రౌండ్ నుండి ర్యాలీగా టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు బాల్కసుమన్, టీఆర్‌ఎస్‌వీ గ్రేటర్‌హైదరాబాద్ అధ్యక్షుడు ఫసియోద్దీన్ బాబాలు వందలాది మందితో రోడ్డుపైకి చేరుకున్నారు. పోలీసులు వీరిని కూడా అడ్డుకుని పెనుగులాట మధ్య అరెస్టు చేశారు. శాంతి ర్యాలీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టీజీవీపీ ఆధ్వర్యంలో నిజాం కళాశాల ప్రాంగణంలో దాదాపు వంద మంది విద్యార్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. సుమారు గంటపాటు ఆందోళన అనంతరం బయటకు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంకెన్నాళ్లీ అరెస్టులు: ఈటెల, స్వామిగౌడ్
తెలంగాణ గడ్డమీద సీమాంవూధుల పెత్తనం ఇంకెన్నాళ్లని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఈటెల రాజేందర్, స్వామిగౌడ్ ప్రశ్నించారు. విద్యుత్ సౌధలో అరెస్టు చేసిన ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌లను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

శాంతిభద్రతల సమస్యగా చూస్తారా?-చుక్కా రామయ్య
విద్యుత్ సౌధ, నిజాం కాలేజీ గ్రౌండ్స్ వద్ద ర్యాలీని అడ్డుకోవడం, నేతలను అరెస్టులు చేయడాన్ని శాసనమండలి మాజీ సభ్యుడు, విద్యావేత్త చుక్కా రామయ్య ఖండించారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.