అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరణ – ఎన్డీయేదే అధికారం

– ఏబీపీ న్యూస్- నీల్సన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 25: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 210 స్థానాలు గెలుపొందడం ద్వారా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఏబీపీ న్యూస్- నీల్సన్ జాతీయ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత దిగువస్థాయికి పడిపోయి 81 స్థానాలు మాత్రమే సాధిస్తుందని పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్ నేతత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి 11 స్థానాలు సాధించవచ్చునని సర్వేలో వెల్లడైంది. మొత్తంగా 226 స్థానాలతో బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని సర్వే అభిప్రాయపడింది. ప్రధానమంత్రిగా ఈ సర్వేలో అత్యధికంగా 53శాతం మంది నరేంద్రమోడీకి ఓటేశారు. అదే సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి 15శాతం మంది, కేజ్రీవాల్‌కు ఐదు శాతం మంది అండగా నిలిచారు. ఓ యువతిపై గూఢచర్యానికి పాల్పడ్డారని మోడీపై వచ్చిన ఆరోపణలు నిజం కావని ఈ సర్వేలో మెజారిటీ 47శాతం మంది అభిప్రాయపడ్డారు. మోడీపై కేంద్రం దర్యాప్తు చేపట్టడాన్ని 36శాతం మంది తప్పుబట్టారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.