అడ్డదారుల్లో ఆంధ్రా నర్సుల పోస్టింగ్!

అడ్డదారుల్లో పోస్టింగ్ ఆర్డర్లు తెచ్చుకున్న సీమాంధ్ర నర్సులకు మరోసారి తెలంగాణ ఉద్యోగుల నుంచి నిరసన సెగ ఎదురైంది. 610 జీవో, జోన్ల నిబంధనలను ఉల్లంఘిస్తూ.. 18 మంది సీమాంధ్ర నర్సులు సోమవారం ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పవూతిలో విధుల్లో చేరడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యోగుల సంఘం కార్యదర్శి బీ యాదిగిరిగౌడ్ నేతృత్వంలో ఉద్యోగులు, ఉద్యమకారులు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వారిని అడ్డుకొని.. పోస్టింగ్‌లో చేరకుండా తిప్పి పంపారు. గత నెలలోనూ సీమాంధ్ర నర్సులు విధుల్లోకి చేరడానికి వచ్చినప్పుడు టీఎన్జీవో అధ్యక్షుడు జీ దేవీవూపసాదరావు సారథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో ఆస్పత్రి డైరెక్టర్ కన్నన్ వారిని విధుల్లోకి చేర్చుకోలేదు.

మరోసారి వారు పోస్టింగ్‌లో చేరడానికి రావడంతో తెలంగాణ ఉద్యోగులు, నర్సులు తీవ్రంగా నిరసన వ్యక్తంచేశారు. తెలంగాణ నర్సులకు న్యాయం జరగాలి, 610 జీవో అమలు చేయాలి, సీమాంధ్ర నర్సులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేవరకు నర్సుల పోస్టుల భర్తీని నిలిపివేయాలని నేతలు యాదిగిరి గౌడ్, శ్రీరాములు, మినాజుద్దీన్, నర్సుల సంఘం నాయకురాలు సుకన్య, విజయకుమారి, పద్మావతి, భూమయ్య తదితరులు డైరెక్టర్ కన్నన్‌ను కలిసి డిమాండ్ చేశారు. డైరెక్టర్‌ను చుట్టుముట్టి సీమాంధ్ర వారిని అడ్డదారుల్లో మళ్లీ ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం వెనక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ అనుమతి, పోస్టుల కేటాయింపులు, నిధులు మంజూరు లేకుండానే అడ్డదారిలో సీమాంధ్ర నర్సులు ఆర్డర్లు పొందారని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి డైరెక్టర్ కన్నన్ దిగొచ్చారు. నర్సుల పోస్టింగ్‌ను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలంగాణ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.