అటానమస్ ముసుగులో తెలంగాణ కొలువులు లూటీ

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంబద్ధంగా ప్రక్రియ పూర్తికావస్తున్న తరుణంలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు రాజీవ్‌గాంధీ టెక్నాలజీ, సాంకేతిక విశ్వవిద్యాలయం అన్యాయానికి ఒడిగట్టింది. తమ యూనివర్సీటీకి స్వతంత్ర ప్రతిపత్తి ఉందన్న సాకు చెప్పి.. ఆర్జీయూకేటీలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల్లో ఇష్టారాజ్యంగా నియామకాలకు తెరలేపారు. ఒక్క తెలంగాణ నిరుద్యోగికీ అవకాశం ఇవ్వకుండా పూర్తిగా సీమాంవూధులతో, రాష్ట్రేతరులతో పోస్టులు భర్తీ చేసేందుకు హడావుడి చేస్తున్నారు. వైస్ చాన్స్‌లర్ వీ రాజ్‌కుమార్ నిర్ణయాల కారణంగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ ప్రాంత నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రతిపత్తి ముసుగులో..: ఆర్జీయూకేటీకి రాష్ట్ర యూనివర్సిటీల చట్టం వర్తించదు. దీనికి ప్రత్యేక చట్టం ఉంది. దీంతో ఆర్జీయూకేటీ మిగతా యూనివర్సిటీల కంటే భిన్నమైనదని, ఈ యూనివర్సిటీకి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నందున ఆర్జీయూకేటీ గవర్నింగ్ బాడీ నిర్ణయాల మేరకు నియామకాలు చేపట్టే హక్కు తమకు ఉందని అధికారులు అంటున్నారు. అయితే ఈ పేరుతో సీమాంవూధకు చెందిన ఆర్జీయూకేటీ అధికారులు తమ ఇష్టానుసార నిర్ణయాలలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర యూనివర్సిటీల చట్టం వర్తించని కారణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఇక్కడ అప్లయి కావటం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందుతూ కేవలం ఆంధ్రా ప్రాంతానికి మాత్రమే లాభం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ప్రాంతం వారికి అన్యాయం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.
ఇదీ జరిగిన తంతు
రాష్ట్ర ప్రభుత్వం ఆర్జీయూకేటీలోని మూడు క్యాంపస్‌లలో నాలుగు కేటగిరీల్లో 438 పోస్టులు భర్తీ చేయాలని అనుమతి ఇచ్చింది. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. కానీ నోటిఫికేషన్‌లో మాత్రం నాలుగు కేటగిరీలకు బదులు మూడు కేటగిరీలే ఉన్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కేటగిరీల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను సమాన కేటగిరీగా చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి పొందలేదు. నోటిఫికేషన్ జారీ అయి.. ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ రెండు కేటగిరీల్లో 123 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కాగా, 123 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల పోస్టుల సంఖ్య 246. ఈ కేటగిరీలను మెర్జ్ చేయటం ఒక తప్పిదం కాగా ఈ కేటగిరీల్లో సాధారణ రిజర్వేషన్లు పాటించలేదన్న అరోపణలు కూడా ఉన్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ఉద్యోగాల ఎంపికలో ఇంటర్వ్యూల ప్రక్రియ సాయంత్రం 5, 6 గంటల వరకే కొనసాగించాలి. కానీ అక్టోబర్ 25వ తేదీన అర్ధరాత్రి 12 గంటల దాటే వరకు వరకూ ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులకు ఈ మెయిల్ ద్వారా నియామక సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం వైస్ చాన్స్‌లర్‌గా ఉన్న రాజ్‌కుమార్ ఈ ప్రక్రియలో అన్ని తానై వ్యవహరించారని తెలంగాణ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

ఇంటర్వ్యూలో సబ్జెక్టు నిపుణులు కాకుండా వీసీయే ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు కారణం.. గతంలో ఐఐటీ ఢిల్లీ, ఖరగ్‌పూర్‌లలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, కాంట్రాక్టు పద్ధతి ద్వారా ఇతర రాష్ట్రాల విద్యార్థులు, సీమాంధ్ర విద్యార్థులను కాంట్రాక్ట్ పద్ధతిన ఆర్జీయూకేటీకిలోని బాసర, ఇడుపులపాయ, నూజివీడులలో నియమించారు. క్యాంపస్ ఇంటర్వ్యూల సమయంలోనే వారిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ హామీ నెరవేర్చేందుకే ఇంటర్వ్యూల్లో అన్నీ తానై వ్యవహరించి వారు ఎంపికయ్యే విధంగా ప్రయత్నం చేశారని డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులు అందాయి. ఇలా చేయటం ద్వారా తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. ఉదాహరణకు బాసర ఇంజినీరింగ్ విభాగంలో 21 పోస్టులకుగాను రాష్ట్రేతరులు 7, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు 8 మందిని ఎంపిక చేయగా తెలంగాణ ప్రాంతం నుంచి కేవలం ఆరుగురిని మాత్రమే ఎంపిక చేశారు. దీంతో ఈ నియామకాలకు బ్రేక్ వేయాలని డిప్యూటీ సీఎం ఉన్నత విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు సరిగా పాటించలేదని, ప్రస్తతం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని ఎంపిక చేయటంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఆదేశించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.