హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఈ నెల 11న ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే జీవోఎంకు టీఆర్ఎస్ నివేదిక అందజేసింది. తెలంగాణకు రూ. 4.5లక్షల కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని, సింగరేణిపై సర్వహక్కులు తెలంగాణకే ఉండాలని ఆ నివేదికలో తేల్చిచెప్పింది. ఈ క్రమంలో జీవోఎం నిర్వహిస్తున్న కీలకమైన అఖిలపక్ష భేటీకి హాజరయ్యేందుకు టీఆర్ఎస్ సిద్ధం అవుతోంది.
ఇందులోభాగంగా ఈ నెల 11న కేసీఆర్‌తోపాటు ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్తున్నారు. అఖిలపక్షంలో ఏయే అంశాలు ప్రస్తావించాలనే అంశంపై కేసీఆర్ ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. జీవోఎంకు ఇచ్చిన నివేదికలోని అంశాలతో పాటు 12, 13 తేదీలనాటికి రాష్ట్రంలోని రాజకీయ పార్టీల వైఖరులను కూడా జీవోఎం వద్ద ప్రస్తావించాలని, వారి వల్ల రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలను ప్రస్తావించాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. జీవోఎం అఖిలపక్షం భేటీని 12, 13 తేదీలలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఢిల్లీకి వెళ్లాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.