అఖిలపక్షం బంద్ విజయవంతం -ముంపును వదులుకోం

ఖమ్మం, మార్చి 6 : పోలవరం ముంపు మండలాలను ఏకపక్షంగా సీమాంధ్రకు అప్పగించాలన్న కేంద్రం ప్రతిపాదనలకు నిరసనగా గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా బంద్ విజయవంతమైంది. ఖమ్మం, కొత్తగూ డెం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు, పినపాక, అశ్వరావుపేట నియోజకవర్గాల పరిధిలో బంద్ మధ్యాహ్నం వరకు కొనసాగగా, భద్రాచలం డివిజన్‌లో రోజంతా సంపూర్ణంగా ముగిసింది. అఖిలపక్షం పిలుపుమేరకు వర్తక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు, సినియా థియేట ర్స్, బ్యాంకులు తెరుచుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఒకపూట విధులు బహిష్కరించి, అఖిలపక్షానికి మద్దతు పలికారు.

khamam పరీక్షల సీజన్‌ను దష్టిలో పెట్టుకుని, విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చారు. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, టీఎన్జీవో నేతలు ప్రదర్శనలతో హోరెత్తించారు. కాలినడక, బైక్‌లపై ర్యాలీలు నిర్వహిస్తూ ముంపు ప్రాంతాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని నినాదాలు చేశారు. ఖమ్మం బస్టాండ్ ఎదుట ఆర్టీసీ బస్సులను అడ్డుకునే క్రమంలో సీపీఎం నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో పలువురు సీపీఎం నాయకులను అరెస్టుచేశారు.

ముంపును ఖమ్మంలోనే ఉంచాలని డిమాండ్:
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరు తో జిల్లాకు చెందిన గిరిజన గ్రామాలను సీమాంధ్రకు అప్పగిస్తే సహించేది లేదని టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ దిండిగాల రాజేందర్ హెచ్చరించారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారు రవికుమార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకురాలు పోటు కళావతి, ఉద్యోగ జేఏసీ నేతలు కూరపాటి రంగరాజు, ఎన్ వెంకటపతిరాజు, టీడీపీ నాయకుడు షేక్ మదార్‌సాహెబ్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన సందర్భంలో కేంద్రం జిల్లా ప్రజలకు ఆనందం లేకుండా చేసిందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. ముంపు మండలాలను సీమాంధ్రకు అప్పగించకుండా, ఖమ్మం జిల్లాలోనే ఉంచుతూ, నష్టపోతున్న గిరిజన కుటుంబాలకు ఎకరాకు రూ.10 లక్షలు, పునరావాస ప్యాకేజీ కింద మరో రూ.10లక్షలు కేటాయిస్తూ, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వఉద్యోగం ఇవ్వాలని కోరారు. పాత డిజైన్ ప్రకారమే పోలవరం నిర్మాణం చేపట్టి, గిరిజనుల జీవన విధ్వంసానికి పాల్పడితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.