అఖిలపక్షం కాంగ్రెస్ ఆడుతున్న నాటకం:కేసీఆర్

అఖిలపక్ష సమావేశం అన్నది కాంగ్రెస్ ఆడుతోన్న నాటకమని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో రేపు జరుగబోయే అఖిలపక్ష సమావేశానికి బయలుదేరుతూ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలనకుంటే ఎప్పుడో ఇచ్చేదని ఆయన తెలిపారు. ‘మూడేళ్లుగా కాంగ్రెస్ తెలంగాణ అంశాన్ని నాన్చుతుంది. దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టుంది కాంగ్రెస్ పరిస్థితి’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

తేలుతుందన్న ఆశలేదు
తెలంగాణపై ఏదో తేలుతుందని ఆశ లేదని, ఇప్పుడు కూడా కేంద్రం ఏదో తేల్చుతుందని తాము వెళ్లడంలేదని, తెలంగాణ గురించి గత పుష్కరకాలంగా పోరాటం చేస్తోన్న పార్టీగా తమ వాదనను వినిపించడానికే వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ఎంపీల ఓట్ల కోసమే —————
తెలంగాణ ఎంపీలను బుజ్జగించి ఎఫ్‌డీఐలపై వారి ఓట్లు వేయించడానికి కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ప్రకటించిందని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌కు సిగ్గూ, శరం ఉంటే వెంటనే తెలంగాణను ప్రకటించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన కేంద్రం ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే వెంటనే తెలంగాణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.


బాబు పచ్చి అబద్దాలకోరు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాలకోరు, వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది కూడా బాబే అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణకు అనుకూలమని చెప్పి డిసెంబర్ 9 తర్వాత యూటర్న్ తీసుకున్నది టీడీపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. 200లో మేనిఫెస్టోలో టీడీపీ తెలంగాణ అంశాన్ని పెట్టిందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని లబ్ది పొంది ఆ తర్వాత తోక చూపించిన పార్టీ టీడీపీ అని విమర్శించారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహించడం బాబు పనే అని అన్నారు.

ప్లకార్డులు పట్టుకుని అడ్డుకున్నది వైఎస్సార్సీపీ
డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను పార్లమెంట్‌లో ప్లకార్డులు ప్రదర్శించి అడ్డుకున్నది వైఎస్సార్సీపీ అధినేత జగన్ కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు కేంద్రం తెలంగాణను ప్రకటిస్తే తమకేమీ అభ్యంతరం లేదని అంటున్నారని విమర్శించారు. అలాంటప్పుడు తెలంగాణను ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేయ్యొచ్చుగదా అని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.