అక్షర ఖడ్గం

 

రండి రండి తెలంగాణ రా రమ్మంటుందీ
తల్లి పాల రుణం దీర్చె తరుణం వచ్చిందీ
గళమున నిప్పులు గానాలే బాణాలుగా
ప్రాణాలే పోనీ… తల్లి పాదాలకు మోకరిల్లీ

అక్షరము వెపను కన్న లక్ష రెట్లు మిన్నా
మనిషికన్న తెలంగాణ మట్టి గొప్పదన్నా
కడుపులోన తలబెడత కాళ్లకు దండం బెడుత
కంచె చేనుమేస్తే ఎలా? వంచకులను ఎండగట్ట

మట్టిని పెకిలించి విత్తనాలు మొలకలెత్తినట్లు
స్వర్ణోదయ కిరణాలను చనుబాలుగ తాగినట్లు
దిక్కుదిశలు దిగంతాలు దివిటీలై వెలిగినట్లు

చీమలు నివసించే నేల పాములు జీవించుటేల?
తుట్టెలు కదిపితే తేనేటీగల ముట్టడులె కదా!
మిడుతల దండొచ్చివాల మిగిలేదేముంది నేల?
అడవి దున్నలు కొమ్మున కుమ్మితె సింహాలకె దిమ్మతిరుగు

కనుచూపులను విసిరే కత్తులుగా చేసీ
అవసరమైతే శత్రువు కుత్తుక తెగగోసీ
ఒకరిద్దరు కాదు, వేలు లక్షలు కోట్లాది జనం
ఒక్కటైతె చాలు తెలంగాణ వచ్చి తీరుతుందీ.

This entry was posted in POEMS.

Comments are closed.