అంతా తెలంగాణమే

అఖిలపక్షంలో తేల్చిచెప్పిన టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం
త్యాగాలు చేసిన తెలంగాణ ప్రజల కోసమా?.. దోచుకున్న సీమాంధ్రుల కోసమా?
ఎవరికోసం ఈ తెలంగాణ ఏర్పాటు?.. జీవోఎంను ఘాటుగా ప్రశ్నించిన కేసీఆర్
భద్రాచలం తెలంగాణ అంతర్భాగం : దామోదర
ఆంటోనీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు : ఒవైసీ

ఆంక్షలులేని తెలంగాణ.. ఇదీ అఖిలపక్షంలో వెల్లడైన ఆకాంక్ష! తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీలతో వేర్వేరుగా జరిపిన సమావేశాల్లో తొలిరోజు అంతా తెలంగానమే వినిపించింది. హైదరాబాద్‌ను యూటీ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తొలి రోజు జీవోఎం ముందు హాజరైన పార్టీలు తేల్చి చెప్పాయి. ఒక్క కాంగ్రెస్‌లోనే భిన్నాభివూపాయం వినిపించింది. ఆ పార్టీ తరఫున హాజరైన డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయగా.. అదే పార్టీ నుంచి సీమాంధ్ర తరఫున పాల్గొన్న మంత్రి వట్టి వసంతకుమార్ మాత్రం సమైక్యవాదమే వినిపించారు. ఎంఐఎం తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకమే అయినప్పటికీ.. విభజించిన పక్షంలో హైదరాబాద్‌ను యూటీ చేయడాన్ని, ఉమ్మడి రాజధానిగా ఉంచడాన్ని వ్యతిరేకిస్తామని చెప్పింది. మిగిలిన పార్టీల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ప్రతినిధులు హైదరాబాద్ సహిత పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సీమాంధ్రులు వివాదం చేస్తున్న భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తేల్చి చెప్పారు. హైదరాబాద్‌పై ఆంక్షలు విధించి, అధికారాలన్నీ సీమాంధ్రుల వద్దే కేంద్రం ఉంచి తెలంగాణ ఇవ్వడమంటే తెలంగాణను కరి మింగిన వెలగపండును చేయడమేనని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు జీవోఎంకు స్పష్టం చేశారు.

ప్రజలు ఎలాంటి తెలంగాణ కోరుకుంటున్నారో వివరించాం. ఎలాంటి షరతులు పెట్టినా తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుంది. దేశంలోని 28 రాష్టాలు ఎలా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం కూడా అవే అధికారాలతో ఏర్పాటుకావాలి. మా నివేదికపై మంత్రుల బృందం స్పందించింది.

– కే చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు

భద్రాచలం తెలంగాణ అంతర్భాగం. దానిని ఆంధ్రలో కలిపితే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. గోదావరి నదీ జలాల పంపకానికి రెగ్యులేటరీ వ్యవస్థ అక్కర్లేదు.కృష్ణా జలాల పంపిణీకే అది అవసరం. 371-డీ నిబంధనను కొనసాగించాలి. 2014 జనవరి ఒకటి నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది.

– దామోదర రాజనర్సింహ, డిప్యూటీ సీఎం

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.